
కొవ్వూరులో చెత్త శుద్ధి చేసే ప్లాంటు వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు: డంపింగ్ యార్డులో పేరుకు పోయిన చెత్తను లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా వర్షాకాలంలోగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. మాధవీలత సూచించారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా ప్లాస్టిక్, రబ్బర్, గాజు సీసాలు, మట్టి బెడ్డలు, రాళ్లు, మెత్తటి ఇసుక, మెడికల్ వేస్ట్ వంటి వ్యర్థాలను వేరు చేస్తున్నారన్నారు. కొవ్వూరు డంపింగ్ యార్డులో ఎనిమిది వేల టన్నుల చెత్త పేరుకు పోయిందన్నారు. రాష్ట్రస్థాయిలో తరుణ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ, ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందం మేరకు ఈ యూనిట్‌ను నెలకొల్పినట్లు కలెక్టర్ తెలిపారు. డంపింగ్ యార్డులో ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా వచ్చిన మట్టిని ప్రభుత్వ స్థలాల మెరక పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండు వేల టన్నుల చెత్తను శుద్ధి చేశామని, రోజుకు 200 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నట్టు కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. మిగిలిన ఆరువేల టన్నుల చెత్తను సాధ్యమైనంత తొందరగా శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా సేకరించి విభజించిన ఆర్‌డీఎఫ్ (రిఫ్యూజ్ డిరైవడ్ ప్యూయల్) మెరిటీరియల్‌ను విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియతో కొవ్వూరు పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న చెత్త సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ఇక్కడి చెత్తను తొలగించిన తర్వాత, అదే స్థలంలో మోడల్ పోలీసు స్టేషన్ నిర్మించనున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. కొవ్వూరు ఆర్డీవో ఎస్.మల్లిబాబు, మునిసిపల్ కమిషనర్ బి.శ్రీకాంత్, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్, ఏఈ దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్