కాలేయ మార్పిడికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు

- - Sakshi

పెరవలి: ఓ రోగి కాలేయ మార్పిడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఆ వివరాలిలా ఉన్నాయి. పెరవలికి చెందిన కంకిపాటి సుధాకర్‌ దీర్ఘకాలంగా జీర్ణ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి పరీక్షలు చేసిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. అంతమొత్తం భరించే ఆర్థిక స్థోమత సుధాకర్‌ కుటుంబానికి లేదు. అతడి సమస్యను గుర్తించిన వైఎస్సార్‌ సీపీ స్థానిక నాయకులు విషయాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు అవసరమైన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించాలని వారు కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి అందుకు అవసరమైన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. దీంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సుధాకర్‌ కాలేయ మార్పిడికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. మంజూరు పత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు బుధవారం పెరవలిలో రోగి సుధాకర్‌కు అందజేశారు. దాంతో సుధాకర్‌ ఆనందానికి అవధులు లేవు. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోతాయేమోనని జీవితంపై ఆశ వదులుకున్నానన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు దయవల్ల తనకు జీవితంపై ఆశ కలిగిందన్నారు. వారిద్దరికీ రుణపడి ఉంటానన్నారు.

పనులకు ఆటంకం లేకుండా ఇసుక సరఫరా

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నాడు – నేడు పనులకు, ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుకను సరఫరా చేయాలని కలెక్టర్‌ మాధవీలత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లాస్థాయి సాండ్‌ కమిటీ సమావేశం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌తో కలసి కలెక్టర్‌ మాధవీలత పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ఇసుక రీచ్‌లకు అనుమతులు జారీ చేయాలన్నారు. కొవ్వూరు డివిజన్‌ రెండు రీచ్‌లకు సి అనుమతి రావడం జరిగిందన్నారు. జిల్లాలోని ఏడు రీచ్‌లలో 82,548 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయంపై నివేదిక ఇస్తూ పందలపర్రు, జీడిగుంట, కుమారదేవం సాండ్‌ రీచ్‌లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కడియపులంక రీచ్‌ను ఈసీ ప్రతిపాదనకు పంపించామన్నారు.

పకడ్బందీగా

పదో తరగతి పరీక్షలు

కలెక్టర్‌ మాధవీలత

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. అమరావతి నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనుబంధశాఖల అధికారులతో కలసి కలెక్టర్‌ మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 126 కేంద్రాల్లో 26,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 22,732 మంది, ప్రైవేటు విద్యార్థులు 3,397 మంది ఉన్నారన్నారు. అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు కూడా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయన్నారు. ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను జిల్లాలో 99 మంది విద్యార్థులు రాయ నున్నారన్నారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్‌ తదితర వస్తువులు తీసుకురాకుండా చూడాలన్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top