జయలక్ష్మికి కొత్త ఊపిరి

జయలక్ష్మి కో–ఆపరేటివ్‌ సొసైటీ భవనం 
 - Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ: జయలక్ష్మి కోపరేటివ్‌ సొసైటీ ఖాతాదారులకు శుభవార్త. తమిళనాడుకు చెందిన ఓ బ్యాంకు దీనిని టేకోవర్‌ చేసి కష్టాల నుంచి ఒడ్డెక్కించేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సహకారశాఖ అధికారుల అజమాయిషీలో ఏర్పాటైన కొత్త పాలకవర్గం సొసైటీకి మళ్లీ ఊపిరి పోసేందుకు చేస్తున్న ప్రయత్నాలు దారికొస్తున్నాయి. కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి సొసైటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో కలిపి 29 బ్రాంచిలతో నడిచేది. సుమారు 20వేల మంది డిపాజిటర్లు ఉన్నారు. ఒకే ఒక కుటుంబం, వారి బంధుగణంతో ఏర్పాటైన సొసైటీ పాలకవర్గం గతేడాది ఏప్రిల్‌లో బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది విశ్రాంత, చిరు ఉద్యోగులు, చిరు వర్తకులు, రైతులు నిలువునా మునిగిపోయారు. నమ్మి డిపాజిట్లు చేసి మోసపోయారు.

తేలిన లెక్కలు

సొసైటీలో డిపాజిట్లు రూ.520 కోట్లు, రుణాలు సుమారు రూ.703 కోట్ల మేర ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో రూ.123 కోట్లు సెక్యూర్డ్‌ రుణాలు. 365 మంది వద్ద రూ.580 కోట్ల మేర అన్‌ సెక్యూర్డ్‌ రుణాలున్నాయని లెక్క తేలింది. ఈ మొత్తంలో సుమారు రూ.530 కోట్లు గత పాలకవర్గ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, వారి కుమారుడు కలిపి దుర్వినియోగం చేసినట్టు కొత్త పాలకవర్గం ప్రాథమికంగా గుర్తించింది. వీటికి సంబంధించిన రికార్డులు, ఖాతాదారుల రుణ పత్రాలు ప్రస్తుతం సీబీసీఐడీ పోలీసుల విచారణ కోసం స్వాధీనంలో ఉన్నాయి.

త్యాగరాజన్‌తో సానుకూలంగా చర్చలు

జయలక్ష్మి ఖాతాదారుల్లో విశ్వాసాన్ని కలిగించేందుకు కొత్త పాలకవర్గం గట్టిగా అడుగులేస్తోంది. సొసైటీ టేకోవర్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్న బడా ఫైనాన్స్‌ కంపెనీలతో నెల రోజులుగా విస్తృతంగా చర్చిస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఈ సంస్థలతో జరుపుతున్న చర్చలు ఫలప్రదమై ఓ కొలిక్కి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన త్యాగరాజన్‌ అండ్‌ కంపెనీ రిజర్వు బ్యాంక్‌ నిబంధనల ప్రకారం టేకోవర్‌ చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు భోగట్టా. గత నెలలో ఈ సంస్థ ప్రతినిధులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి.

అటాచ్డ్‌ ఆస్తులు లెక్కలేసుకున్నాకే..

జయలక్ష్మి సొసైటీలో త్యాగరాజన్‌ కంపెనీ రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు డిపాజిట్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. గత పాలకవర్గ చైర్‌పర్సన్‌ విశాలాక్షి సహా డైరెక్టర్ల నుంచి అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ లెక్కలేసుకున్నాకే త్యాగరాజన్‌ సంస్థ టేకోవర్‌కు ముందుకు వచ్చింది. అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.కోట్లలోనే ఉంటుందని కొత్త చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాథరావు సారథ్యంలోని పాలకవర్గ సభ్యులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని స్థిరాస్థుల విలువ రూ.600 కోట్లు పైమాటేనని లెక్కలేశారు. కాకినాడ సెజ్‌లోని 12 ఎకరాల విలువే రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్లు ఉంటుందని అంచనా. ఇలా అటాచ్‌చేసిన ఆస్తులు వేలం వేయడం, రికార్డుల ప్రకారం ఉన్న రుణాలు తిరిగి రాబట్టడం ద్వారా సొసైటీకి మళ్లీ ఊపిరిపోయాలని కొత్త పాలకవర్గం ప్రయత్నిస్తోంది.

రికార్డుల కోసం ట్రైబ్యునల్‌కు..

సొసైటీలో రెగ్యులర్‌ రుణాలు రూ.100 కోట్లు వరకు ఉన్నాయి. రుణగ్రహీతలను గుర్తించారు. వారు కూడా రుణాలు తిరిగి చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లుడే రూ.20 కోట్లు బకాయి పడటం విశేషం. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన సమ్మతించారని సమాచారం. ఎటొచ్చీ ఆ రుణగ్రహీతల భూముల డాక్యుమెంట్లు, రికార్డులు ప్రస్తుతం సీబీసీఐడీ స్వాధీనంలో ఉండటమే సమస్యగా తయారైంది. గత పాలకవర్గంపై కేసులు కొనసాగిస్తూనే సీఐడీ నుంచి ఈ రికార్డులను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు ట్రైబ్యునల్‌కు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని సహకార వర్గాలు చెబుతున్నాయి.

కోయంబత్తూరు సంస్థ టేకోవర్‌కు ప్రయత్నం

కొత్త పాలకవర్గం నేతృత్వంలో విస్తృత చర్చలు

ఫలిస్తున్న మంతనాలు

త్వరలోనే ఒప్పందం ఖరారు

ఖాతాదారుల్లో భరోసాకు అడుగులు

విశ్వాసం పెంచేందుకు..

భారీ మొత్తం డిపాజిట్‌ చేశాక ప్రస్తుత పాలకవర్గం ఆధ్వర్యంలోనే సొసైటీ నిర్వహించాలనేది త్యాగరాజన్‌ సంస్థ భావన. సంస్థ ప్రతినిధి లేదా, ఒకరిద్దరు అసోసియేట్‌ ప్రతినిధులను పాలకవర్గంలో తీసుకోవాలనే అంశంపై ఇరువైపులా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. భారీ డిపాజిట్లతో ఖాతాదారుల్లో నమ్మకం పెరిగితే సొసైటీ దారిలో పడుతుందని కొత్త పాలకవర్గం భావిస్తోంది. మే లేదా, జూన్‌ నెలలో త్యాగరాజన్‌ సంస్థతో ఒప్పందం కొలిక్కి వస్తుందంటున్నారు. మరోసారి ఏప్రిల్‌లో సమావేశం కానున్నారు. అన్ని సజావుగా సాగితే మే నెలాఖరుకు మెచ్యూరిటీ డిపాజిట్లను తిరిగి ఇవ్వాలనేది ప్రతిపాదన. వీటిని చెల్లించాక రుణాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top