
ఘటనా స్థలంలో మృతి చెందిన నాగేశ్వరరావు
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయవరం: ప్రాణప్రదంగా చూసుకుంటున్న కుమార్తెను కనులారా చూసుకుందామని బయలుదేరిన తండ్రి గ్రామ సమీపంలోనే అసువులు బాసాడు. కపిలేశ్వరపురం మండలం కాలేరుకు చెందిన నాగేశ్వరరావు(48) రాయవరం మండలం మాచవరం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి మృతి చెందాడు. మాచవరం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలోనే భార్యను కోల్పోయిన నాగేశ్వరరావు భర్త వద్ద ఉన్న కుమార్తెను చూడడానికి బయలుదేరాడు. కుమార్తె ఇంటికి చేరుకొనేంతలోనే నాగేశ్వరరావును లారీ ఢీకొనడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. రాయవరం పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
సామర్లకోట: రైలు పట్టాలపై ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. జి. మేడపాడు–సామర్లకోట మధ్యలో రాజమహేంద్రవరం వైపు వెళ్లే పట్టాలపై మృతదేహాన్ని రైల్వే కీ మేన్ గుర్తించి స్టేషన్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఎస్‌ఎస్ శేషకృష్ణకాంత్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బుధవారం ఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతుడికి సుమారు 60 సంవత్సరాల వయసు, చామనఛాయ, 5.4 ఎత్తు ఉండగా, తెలుపు ఫుల్ హ్యాండ్స్ షర్టు, తెలుపు లుంగీ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసుల తెలిపారు. కేసు నమోదు చేసి రైల్వే ఎస్సై బి.లోవరాజు దర్యాప్తు చేస్తున్నారు.