
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.370 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమెన్స్ సంస్థ రూ.3,300 కోట్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే.. నాటి చంద్రబాబు ప్రభుత్వం తన వాటా అయిన రూ.370 కోట్లు విడుదల చేసేసిందన్నారు. వీటిని ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ నినాదంతో పంచుకుతిన్నారని దుయ్యబట్టారు. ఇంత త్వరగా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం కారణమని అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తమ నోట్‌ఫైల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. నిధులను సీమెన్స్‌తో పాటు పీవీఎస్‌పీ(స్కిల్లర్స్), డిజైన్ టెక్ వంటి సంస్థలతో డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకున్నారని ఆరోపించారు. విభజిత రాష్ట్రంలో నిధుల కొరత ఉందని హుండీలు పెట్టి మరీ డబ్బులు వసూలు చేసిన బాబు ఇంత పెద్ద మొత్తం ఎలా విడుదల చేశారని విస్మయం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో సీమెన్స్ సంస్థ ప్రతినిధి సౌమ్యాద్రి శేఖర్‌బోస్ చక్రం తిప్పారన్నారు. అక్రమ బాగోతంపై జీఎస్టీ శాఖ దృష్టి సారించడంతో బండారం బట్టబయలైందన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ విభాగం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. జర్మనీలోని సీమెన్స్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సీఐడీ సంప్రదించగా ఇలాంటి శిక్షణ ఇస్తామన్న ప్రతిపాదన ఏదీ చేయలేదని స్పష్టం చేసిందన్నారు. సీమెన్స్ సంస్థ భారత విభాగానికి చెందిన ఇద్దరు ఉన్న ఉద్యోగులు, మరికొందరు స్థానిక కంపెనీ ప్రతినిధులతో కలిసి రూ.370 కోట్లు మింగేశారని వివరించారు. భారీ కుంభకోణానికి బాధ్యులైన చంద్రబాబు, లోకేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా