
స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులతో పోలీసులు
● హుకుంపేటలో పోలీసులకు చిక్కిన ఏడుగురి అరెస్టు ● 120 కిలోల సరకు, వాహనాలు స్వాధీనం
రాజమహేంద్రవరం రూరల్: ఏవోబీ నుంచి న్యూఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఏడుగురిని హుకుంపేటలోని మూడుగుళ్ల సెంటర్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 కిలోల గంజాయి, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్.విజయకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బొమ్మూరు ఎస్సై జగన్‌మోహన్‌రావు, సిబ్బంది బుధవారం మూడుగుళ్లసెంటర్‌లో ఒక ఇంటిలో ఐదుబస్తాలలో ఉన్న 120 కిలోల గంజాయితో పాటు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖజిల్లా సన్యాసిరాజుపాలెం పంచాయతీకి చెంది, ప్రస్తుతం హుకుంపేట మూడుగుళ్ల వీధిలో ఉంటున్న మొగిలి సూర్యనారాయణ, ఏఎస్‌ఆర్‌జిల్లా చింతపల్లి మండలం చింతలూరు గ్రామానికి గెమ్మిలి నాగేశ్వరరావు, వంగసార గ్రామానికి చెందిన సిందేరి రమేష్, శ్రీసత్యసాయిజిల్లా కొత్తచెరువుకు చెంది ప్రస్తుతం హుకుంపేట పంచాయతీ రామకృష్ణనగర్‌లో ఉంటున్న ముత్తరాసి నరేష్, సౌత్ వెస్ట్‌ఢిల్లీకి చెందిన టోనీసచ్‌దేవ్, ప్రిన్స్‌గిల్ధియార్(ప్రిన్స్), వెస్ట్ ఢిల్లీకి చెందిన అర్జున్‌గోపాలస్వామి(శశి)లను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్.విజయకుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందన్నారు. కొనుగోలు చేసిన గంజాయిని నిందితులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారన్నారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి తూర్పు మండల డీఎస్పీ భక్తవత్సలం అభినందించారన్నారు.