
దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద బోల్తాపడిన ట్రాక్టర్
● చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి
దేవరపల్లి: మండలంలోని కృష్ణంపాలెం వద్ద హైవేపై బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం జార్ఖండ్‌లోని పశ్చిమశింబుమ్ జిల్లా చాయ్‌బాషా గ్రామానికి చెందిన సందీప్ దేవగాన్ ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం విజయనగరంలో నారాయణస్వామి వద్ద పనిచేస్తున్నాడు. అక్కడ పనిపూర్తి కావడంతో ఎలక్ట్రికల్ సామాన్లను ట్రాక్టర్‌పై వేసుకుని మంగళవారం విజయనగరం నుంచి నంద్యాలకు వెళుతున్నాడు. ట్రాక్టర్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద హైవేపై కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక వైపు నుంచి వస్తూ ట్రాక్టర్‌ను ఢీ కొంది. ట్రాక్టర్ బోల్తాపడింది. బస్సు ముందు బాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కొనగట్ల మండలం, చినమనగూడెంకు చెందిన బస్సు డ్రైవర్ పొన్నగంటి నారాయణరావు, ట్రాక్టర్ డ్రైవర్ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌తో పాటు ఉన్న మరొక డ్రైవర్ షేక్ ఖాదర్ బాషా తలకు, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్టు ఎస్సై కె. శ్రీహరిరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇద్దరు గోదావరిలో దూకి ఆత్మహత్య
యానాం: వివిధ కారణాలతో గౌతమీ గోదావరిలో దూకి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని బుధవారం ఎస్సై శేరు నూకరాజు తెలిపారు. మొదటి ఘటనలో ఈ నెల 27న యానాం ఫెర్రీ ఏరియాలోని కేవీఆర్ నగర్‌కు చెందిన పోతాబత్తుల మహేష్ (21) జీవితంపై విరక్తితో యానాం–ఎదుర్లంక బాలయోగి వారధిపైనుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. అతని కోసం మూడురోజులుగా గోదావరిలో గాలించగా బుధవారం మృతదేహం లభ్యమయ్యిందన్నారు. రెండవ ఘటనలో గండేపల్లి మండలం మురారీకి చెందిన కాకర్ల వీరశివశంకర్(29) బుధవారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని మృతదేహాన్ని ఎన్‌ఈసీ జెట్టి వద్ద కనుగొన్నామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం యానాం జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగుడిపై తేనెటీగల దాడి
● పరిస్థితి విషమం
● రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు
దేవరపల్లి: మండలంలోని చిన్నాయగూడెంలో దివ్యాంగుడిపై తేనెటీగలు దాడి చేశాయి. దాడిలో యంగల లక్ష్మణరావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన లక్ష్మణరావును చికిత్స కోసం యాదవోలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా సుమారు 50 తేనెటీగల ముళ్లు తొలగించారు. అయినప్పటికి లక్ష్మణరావు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో గల మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకుకు తేనెపట్టు పట్టింది. తరచూ తేనెటీగలు స్థానికులపై దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

గాయపడిన లక్ష్మణరావు