అమలాపురం టౌన్: విలస పోస్టాఫీసులో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఏపీపీబీ) నిధులు రూ.1.18 కోట్లు గోల్‌మాల్ అయిన కేసుకు సంబంధించి అమలాపురం హెడ్ పోస్టాఫీసులో జరుగుతున్న సీబీఐ విచారణ రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది. విశాఖపట్నం సీబీఐ అధికారుల బృందం మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ విచారణ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉంటున్న స్థానిక హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన సతీష్ సీబీఐ విచారణకు బుధవారం హాజరయ్యాడు. నిధుల దుర్వినియోగంపై సతీష్‌ను సీబీఐ అధికారులు దాదాపు అయిదు గంటలపాటు విచారించారు. ఇప్పటికే సస్పెండ్ అయిన పోస్టల్ అసిస్టెంట్ మహాలక్ష్మిని కూడా రెండో రోజూ అధికారులు మరోసారి విచారించారు. ఈ నిధులు దుర్వినియోగంలోని బాధ్యులు ఒక్కొక్కరిని సీబీఐ అధికారులు విచారిస్తుండడంతో కీలక అంశాలపై ఆధారాలతో కూపీ లాగారని తెలిసింది. విచారణ మూడో రోజు గురువారం కూడా కొనసాగనుంది.