భారీగా గంజాయి పట్టివేత
● 24,690 కిలోల సరకు స్వాధీనం
● విలువ రూ.13,29,500
● ఏడుగురి అరెస్టు
కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 16వ నంబర్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో బూరుగుపూడి గ్రామ శివారున మాటు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వైపు మూడు మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఏడుగురు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి 17 ప్యాకెట్లలో ఉంచి తరలిస్తున్న రూ.13,29,500 విలువ చేసే 24,690 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అల్లూరి జిల్లా హకుంపేటకు చెందిన జోగ్ నకుల్‌సింగ్, పంజా దుర్గాప్రసాద్, పెద్దాపురానికి చెందిన పంచదార స్వామి, వనపర్తి రాజేష్, సప్పా అశోక్, లంక శ్రీకల్యాణ్, గొంపు అప్పారావులుగా గుర్తించారు. గంజాయి తరలింపులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నకుల్‌సింగ్‌ను ఏ1గా, జంపా దుర్గాప్రసాద్ ఏ2, పంచదార స్వామి ఏ3, వనపర్తి రాజేష్ ఏ4గా పేర్కొన్నారు. గతంతో వీరిపై ఎన్‌డీపీఎస్ కేసులు ఉన్నాయి. ఏ5 సప్పా అశోక్‌పై హత్య కేసు ఉంది. నిందితులపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టించిన ఈగల్ టీమ్‌ను, ఎస్సైని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకర్ల సమావేశంలో సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఎస్సై సతీష్ కూడా పాల్గొన్నారు.


