ఏమి సేతురో!
సాక్షి, అమలాపురం: గోదావరి నదీపాయల మధ్య దీవులుగా ఉన్న కోనసీమకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కల్పించినదీ.. ఈ ప్రాంత వాసుల రాకపోకలకు అనువుగా మార్చినదీ.. ఇక్కడ పండే వ్యవసాయ.. ఉద్యాన.. ఆక్వా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ ఎగుమతులకు అనువుగా చేసినదీ ఇక్కడి వారధులే. కోనసీమ అభివృద్ధిలో ఇవెంతో కీలకంగా నిలిచాయి. ఇక్కడ నిర్మించిన పాత కాలం నాటి వారధులు కొన్ని దెబ్బతింటున్నాయి. బరువు తట్టుకునే సామర్థ్యం తగ్గడంతో వీటికి మరమ్మతులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇటీవల దిండి– చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు చేపట్టగా, తాజాగా పి.గన్నవరం అక్విడెక్టు మరమ్మతులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రావులపాలెం– జొన్నాడ మధ్య ఉన్న పాత వంతెనకు మరమ్మతులు చేయగా, ఐలెండ్ (ఐ.పోలవరం)–ముమ్మిడివరం మధ్య ఉన్న రాఘవేంద్ర వారధికి సైతం మరమ్మతులు చేసి నెట్టుకువస్తున్నారు.
కోనసీమ దీవిలో కీలకమైన వంతెనల పరిస్థితి ఇలా దిగజారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా ఉండడంపై ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. జిల్లాలోని దిండి–చించినాడ పి.గన్నవరం అక్విడెక్టులకు ఏకకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే భారీ వాహనాలకు, ప్రజా రవాణాకు బ్రేక్ పడుతుంది. రాజోలు నుంచి పశ్చిమ గోదావరికి చేరాల్సిన భారీ వాహనాలు బోడసకుర్రు వంతెన మీద నుంచి అమలాపురం, రావులపాలెం మీదుగా సిద్ధాంతం వంతెన దాటాల్సి ఉంది. ఇది తమకు వ్యయప్రయాసలుగా మారుతోందని స్థానికులు, రైతులు వాపోతున్నారు.
దిండి–చించినాడ.. మూడు నెలలుగా నత్తనడకనే..
జాతీయ రహదారి 216లో కీలకమైన దిండి–చించినాడ వంతెన సూపర్ స్ట్రక్చర్ బలహీన పడినట్లు నేషనల్ హైవే ఇంజినీర్లు గుర్తించారు. ప్రధాన పిల్లర్లలో లూజ్ పాకెట్‌లు ఏర్పడ్డాయి. భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన బాగా స్వింగ్ అవుతోందని గుర్తించారు. ఏకంగా 56 బేరింగ్‌లకు గాను 40 దెబ్బతిన్నాయి. 1995 సంవత్సరంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి అనేక అవాంతరాల అనంతరం వంతెనను 2001 సంవత్సరంలో పూర్తి చేశారు. 216 జాతీయ రహదారిగా మారిన తరువాత గడచిన పదేళ్లుగా నిమిషానికి అరవై నుంచి డబ్బై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చైన్నె నుంచి విశాఖపట్నం, కోల్‌కతాకు రాకపోకలు సాగించే వాహనాలు కూడా ఒంగోలులో ఎన్‌హెచ్ 16ను వీడి 216 జాతీయ రహదారి ద్వారా కోనసీమ జిల్లా మీదుగా కాకినాడ జిల్లా కత్తిపూడికి చేరుకుంటున్నాయి. దీనితో రద్దీ విపరీతంగా పెరగడంతో వంతెన మరింత దెబ్బతింది. వంతెన మరమ్మతులలో భాగంగా బేరింగ్‌ల స్థానంలో కొత్తవాటిని అమర్చాల్సి ఉంది. తరువాత వంతెనపై రహదారి నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు చేయాలి. గత జూలై 23వ తేదీ నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసి అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తయితే గొప్ప విషయమే మరి.
మరమ్మతుల్లో ఉన్న
దిండి–చించినాడ వంతెన
మొన్న దిండి–చించినాడ..
నేడు గన్నవరం అక్విడెక్ట్..
గతంలో రావులపాలెం జొన్నాడ..
ప్రమాదంలో పాత వంతెనలు
వాహనాల రాకపోకలకు బ్రేకులు
ప్రమాదంలో కోనసీమ వారధులు
దిండి బాటలోనే పి.గన్నవరం అక్విడెక్టు
పి.గన్నవరం అక్విడెక్టుపై కూడా రాకపోకలు నిలిచిపోనున్నాయి. 2000 సంవత్సరం జూలై 22 నుంచి ఇది వినియోగంలో ఉంది. అక్విడెక్టు జాయింట్లు దెబ్బతినడంతో రూ.49.30 లక్షలతో విస్తరించనున్నారు. ఇందుకు 42 రోజులు సమయం పడుతుందని చెబుతున్న అధికారులు అప్పటి వరకు రాకపోకలు నిలిపివేయనున్నారు. మరో పది రోజులలో ఇక్కడ పనులు మొదలు కానున్నాయి. కొత్త అక్విడెక్టుపై పనులు ప్రారంభించేందుకు పాత అక్విడెక్టుకు మరమ్మతులు మొదలు పెట్టారు. సుమారు 166 ఏళ్ల నాటి పాత అక్విడెక్టు సామర్థ్యాన్ని పరిశీలించిన తరువాత వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక్కడ కూడా భారీ వాహనాల రాకపోకలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
రాఘవేంద్ర వారధి.. మరమ్మతులతో సరి..
ఐ.లెండ్‌కు, మిగిలిన కోనసీమ ప్రాంతానికి మధ్య రాకపోకల కోసం మరమళ్ల రాఘవేంద్ర వారధిని 1980లో నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 లక్షల రూపాయలు విరాళాలు అందించారు. దీనిని నిర్మించి 45 ఏళ్లు అవుతోంది. తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇది 216 జాతీయ రహదారిలో భాగంగా ఉంది. కాని వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించలేదు. మరమ్మతులు చేసిన వంతెన మీదనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. తొలుత యానాం–ఎదుర్లంక మీద వంతెన నిర్మాణం పూర్తి కావడం, తరువాత జాతీయ రహదారిగా మారడంతో వాహనాల రాకపోకలు పది రెట్లు పెరగడంతో ఇది తరచూ మరమ్మతులకు గురవుతోంది.
ఏమి సేతురో!
ఏమి సేతురో!


