పురపాలక సంఘాలలో సౌర విద్యుత్ పెట్టాలి
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: పురపాలక సంఘాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి అయ్యి విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నెడ్‌క్యాప్, మున్సిపల్, ఏపీ ఈపీ డీసీఎల్ అధికారులతో అమలాపురం పురపాలక సంఘ పరిధిలో నడిపూడిలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. సోలార్ విద్యుత్ వల్ల నగర, స్థానిక సంస్థలకు ఆర్థిక, పర్యావరణ, సేవల నాణ్యత పరంగా దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయన్నారు. గ్రిడ్ విద్యుత్ కొనుగోలు తగ్గడం వల్ల నెలవారీ బిల్లులు తగ్గించుకోవచ్చునన్నారు. ఒక మెగా యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన అంచనాలపై అధికారులతో సమీక్షించి ప్రతిపాదిత ఏడు కోట్ల పెట్టుబడిని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. భవనాలపై సోలార్ పెట్టడం ద్వారా గ్రీన్ మున్సిపాలిటీ, సోలార్ స్మార్ట్ టౌన్ వంటి బ్రాండింగ్ సాధ్య మవుతుందని, దాని వల్ల అదనపు కేంద్ర, రాష్ట్ర ప్రోత్సాహకాలు, అవార్డులు అందుకోవచ్చునని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో కె. మాధవి, ఏపీ ఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ బి.రాజేశ్వరి పాల్గొన్నారు.
వాడబోది పూడిక తీతకు ప్రతిపాదనలు
మామిడికుదురు మండలం పాసర్లపూడి వాడబోది మేజర్ డ్రైయిన్ పూడిక తీత పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఈ మేరకు డ్రైనేజీ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ అధికారులు, ఓఎన్‌జీసీ ఇంజినీర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 40 ఏళ్లుగా ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల నీరు పారకపోవడంపై ఇంజినీర్లు కలెక్టర్‌కు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీని వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను ఆయన అడిగి తెలుసు కుని ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.
రహదారి నిర్మాణంలో క్వాయర్ మ్యాట్లు
అల్లవరం: బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాయర్ మ్యాట్‌ల వినియోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. మండలం ఎంట్రుకోనలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన రహదారి నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. రహదారికి అడుగు భాగంలో ఏర్పాటు చేసిన క్వాయర్ మ్యాట్‌ను పరిశీలించి దాని పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


