టెట్‌కు 45 మంది గైర్హాజరు
రాయవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 45 మంది గైర్హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నుంచి టెట్ ప్రారంభమైంది. ముమ్మిడివరం మండలం చెయ్యేరు పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 300 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 278 మంది హాజరై, 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే అమలాపురం భట్లపాలెంలోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 205 మంది హాజరు కావాల్సి ఉండగా 182 మంది హాజరై 23 మంది గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన టెట్ పరీక్షకు రెండు సెంటర్లలో కలిపి 250 మంది హాజరు కావాల్సి ఉండగా 221 మంది హాజరై 29 మంది గైర్హాజరయ్యారు. రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
నేటి నుంచి ఢిల్లీ విమానం
కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎన్‌కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్ తెలిపారు.
ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్
కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ 3, ఆడియో మెట్రీషియన్ 4, టీబీ హెల్త్ విజిటర్ 5, ఫార్మసిస్ట్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ 2, పబ్లిక్ అండ్ ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ ఫర్ టీబీ 1, అకౌంటెంట్ 2, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ 1, ఎల్‌జీఎస్ 8 పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్‌లోడ్, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు.
రూ.3.73 లక్షల హుండీ ఆదాయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,72,809 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వడ్డి ఫణీంద్రకుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


