రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు
● మరొకరికి తీవ్రగాయాలు
జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్‌ఎల్ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వేమూరి మురళీకృష్ణ (60), తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్ సమీపంలో ఎక్స్‌ఎల్‌ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి (35)కి, మురళికృష్ణకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


