గంటలకొద్దీ జాప్యం.. ప్రయాణికులకు శాపం
● తీవ్ర ఆలస్యమైన
నాన్‌స్టాప్ బస్సులు
● జనానికి అవస్థలు
రాజమహేంద్రవరం సిటీ: కాకినాడ నాన్‌స్టాప్ బస్సులు సుమారు మూడు గంటల పాటు రాకపోవడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ బస్సు తిరగాలి. అయితే, శనివారం సాయంత్రం ఏకంగా మూడు గంటల పాటు నాన్‌స్టాప్ బస్సులు రాలేదు. రాత్రి 7 గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో, రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాకినాడ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడి తీవ్ర అవస్థలకు గురయ్యారు. నాన్‌స్టాప్ బస్సులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల రాకపోకలపై అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య నిత్యం వందలాది మంది ప్రయాణిస్తూంటారని, వారికి ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుల రాకలో జాప్యం జరిగితే, వెంటనే ప్రత్యామ్నాయంగా బస్సులు ఏర్పాటు చేసి, తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సామర్లకోట వద్ద వంతెన నిర్మాణ పనుల కారణంగా కాకినాడ నాన్‌స్టాప్ బస్సుల రాకలో జాప్యం జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ మాధవ్ చెప్పారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే నాన్‌స్టాప్ బస్సులు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకూ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.


