21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయంలో ప్రారంభమవుతుంది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు శనివారం ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి ఈ సమావేశం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమ శాఖకు సంబంధించి ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు.
బాలిక అదృశ్యం
రంగంపేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శివప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వడిశలేరు గ్రామానికి చెందిన కొల్లం వెంకట రమణ పెద్ద కుమార్తె శ్రీవల్లి (17) శుక్రవారం ఉదయం బ్యాంకు పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతికారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు రంగంపేట ఎస్సై 94409 04854, అనపర్తి సీఐ 94407 86538లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
డిగ్రీ విద్యార్థిని..
అమలాపురం టౌన్: అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని గుబ్బల జ్యోత్స్న అదృశ్యమైంది. ఆమె అమలాపురంలోని వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో చదువుతోంది. శనివారం ఉదయం ఇంటి నుంచి కాలేజీకి అమలాపురం బయలుదేరింది. అయితే కాలేజీకి రాలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో తండ్రి అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎన్‌ఆర్ కిశోర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సీఐ పి.వీరబాబు 94407 96561, ఎస్సై కిశోర్ బాబు 81435 79127కు తెలియజేయాలన్నారు.


