చెరువులపై అక్రమార్కుల కన్ను
● దర్జాగా కబ్జా చేస్తున్న వైనం
● అనుమతులు లేకుండా పూడ్చివేత పనులు
● గ్రామాలకు తాయిలాల పేరుతో ఆక్రమణ
తాళ్లరేవు: పంచాయతీ చెరువులపై అక్రమార్కుల చూపు పడింది. గ్రామాల్లోని చిన్నాచితకా చెరువులను దర్జాగా కబ్జా చేసి పూడ్చివేస్తున్నారు. గ్రామాలకు చిన్న తాయిలాలు ఎరచూపి రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించి ఆనక సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిన చెరువులు నేడు నిరుపయోగంగా మారడంతో వాటిపై అక్రమార్కులు కన్నేశారు. కొందరు నాయకుల అండదండలతో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న గ్రామ పంచాయతీ చెరువులు, గ్రామ కంఠం భూములు కనుమరుగవుతున్నాయి.
ఇలా వెలుగులోకి..
కోరంగి పంచాయతీ పరిధి దిండి గ్రామంలో ఒక మంచినీటి చెరువును కొందరు అక్రమార్కులు పూడ్చివేస్తుండడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి వీజేవీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణ వెలుగు చూసింది. దిండి గ్రామంలోని సర్వే నెంబరు 298లో 0.64 సెంట్ల భూమిలో పంచాయతీ చెరువు ఉంది. గతంతో దీని నీటినే గ్రామస్తులు తాగేవారు. ఎన్నో ఏళ్లుగా ఈ చెరువులో ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు తవ్వకం, సంరక్షణ చర్యలు చేపట్టేవారు. అయితే ఆ చెరువును కొందరు అక్రమార్కులు జేసీబీల సాయంతో పూడ్చివేస్తుండడంతో పంచాయతీ కార్యదర్శి అడ్డుకున్నారు. అయితే ఆ భూమిని ఎవరు కొన్నారు, ఎవరి వద్ద కొన్నారు, ఎవరు కప్పెడుతున్నారు అనే వివరాలను వెల్లడించకపోవడం, పంచాయతీ అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా చెరువు పూడ్చివేస్తున్నారని కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువు పూడ్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
మరికొన్ని..
సుంకరపాలెం గ్రామ పంచాయతీలో యానాం – ద్రాక్షారామ రహదారి చెంతన ఉన్న సుమారు రెండు ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. మిగిలిన సుమారు 60 సెంట్లకు పైగా ఉన్న భూమిని సైతం పలువురు పూడ్చివేయడం గతంలో చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు సామాజిక కార్యకర్తలు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అది కూడా తాత్కాలికంగా ఆగింది. అయితే కొందరు బడా నాయకులు గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామంటూ, గ్రామ పెద్దలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని చెబుతుండడంతో ఆక్రమణల పర్వం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఉన్న పంచాయతీ చెరువులను పూడ్చివేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోరంగి పంచాయతీ దిండిలోని పురాతన మంచినీటి చెరువు పూడ్చివేత పనులు
సుంకరపాలెం పంచాయతీలో గ్రామ చెరువును పూడ్చి వేస్తున్న వైనం
చెరువులపై అక్రమార్కుల కన్ను
చెరువులపై అక్రమార్కుల కన్ను


