నేటి నుంచి రాష్ట్ర స్థాయి స్క్వాష్, జూడో పోటీలు
● 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు
● డీఎస్‌ఏలో ఏర్పాట్లు పూర్తి
బాలాజీచెరువు: కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ –14, 17 ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి స్క్వాష్, జూడో పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 200 మంది స్క్వాష్‌కు, 300 మంది జూడోకు హాజరుకానున్నారు. పోటీల నిర్వహణ నిమిత్తం నిర్వాహకులు స్క్వాష్ కోర్టు, జూడో హాలును సిద్ధం చేశారు. బాలురు, బాలికలకు కాకినాడ జిల్లా క్రీడా మైదానం, వాకలపూడి జెడ్పీ హైస్కూల్‌లో వసతి ఏర్పాట్లు కల్పించారు. గురువారం పోటీల నిర్వహణ ఏర్పాట్లను డీఈవో రమేష్, ఎస్‌జిఎఫ్‌ఐ కార్యదర్శులు శ్రీను, సుధారాణి పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు స్క్వాష్ పోటీలు, సాయంత్రం 4 గంటలకు జూడో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ డీఈవో సూచనల మేరకు వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోటీల నిర్వహణలో జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు సహకారాన్ని అందిస్తున్నారు.
విధుల నుంచి
స్కూల్ అసిస్టెంట్ తొలగింపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జగన్నాధపురం బచ్చు రామం నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కేవీవీ సత్యనారాయణను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాఽధికారి ఉత్తర్వులు జారీచేశారు. కొనేళ్లుగా ఆయన బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు తప్పుడు పదజాలంతో వారిని వేధిస్తున్నారు. దీంతో 8, 9 తరగతుల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 4న వారంతా పాఠశాలకు వచ్చి హెచ్‌ఏంకు విషయాన్ని వివరించారు. ఆయన ఉన్నత అధికారులకు సమాచారం నివేదించారు. ఎంఈఓ సుబ్బారావు, డీవైఈఓ సత్యనారాయణ పాఠశాలకు వచ్చి విద్యార్థులను విచారించి జిల్లా కార్యాలయానికి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా డీఈఓ పిల్లి రమేష్ ఆయనను విధుల నుంచి తొలగించారు.
హైవేపై కారు దగ్ధం
మరమ్మతు అనంతరం ట్రైల్ వేస్తుండగా ఘటన
తుని రూరల్: తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం కారు దగ్ధమైంది. తునికి చెందిన వైద్యుడు తన కారును మరమ్మతుల నిమిత్తం షెడ్డుకు ఇచ్చారు. మరమ్మతులు అనంతరం ట్రైల్ వేసేందుకు మెకానిక్ కారును తుని నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీ షార్టు సర్క్యూట్‌తో పొగరావడాన్ని మెకానిక్ గమనించి కారు దిగి చూడగా ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించి దగ్ధమైనట్టు అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. ప్రాణాపాయం తప్పిందని, రూ.తొమ్మిది లక్షలు నష్టం వాటిల్లిందన్నారు.


