లారీ ఢీ కొని బాలుడి మృతి
రాజానగరం: మండలంలోని శ్రీకృష్ణపట్నం – పాత తుంగపాడు మధ్య మంగళవారం జరిగిన ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలా వున్నాయి. పాత తుంగపాడుకు చెందిన నాగులాపల్లి జాన్‌వె వెస్లీ (14), తన స్నేహితుడు బోయిడి దుర్గాప్రసాద్‌తో కలిసి బైకుపై శ్రీకృష్ణపట్నం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టిన వెంటనే బైకుపై వెనుక కూర్చున జాన్‌వెస్లీ కింద పడిపోవడంతోపాటు లారీ కొంతదూరం లాక్కుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవ్ చేస్తున్న దుర్గాప్రసాద్‌కి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు ద్వారపూడిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు.


