అయోధ్యకు పంచలోహ శివలింగం తరలింపు
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలోని సహస్ర రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తిగా ప్రతిష్ఠించేందుకు 1,027 సూక్ష్మ లింగాలతో రూపొందిన పంచలోహ మహా శివలింగం సోమవారం మండపేట నుంచి అయోధ్యకు తరలించారు. దాత ఆర్డరుపై మండపేట పట్టణానికి చెందిన పంచలోహ విగ్రహాల తయారీ శిల్పి వాసా శ్రీనివాస్ ఈ శివలింగాన్ని తయారు చేశారు. మహాశివలింగంలో 1,027 సూక్ష్మ శివలింగాలను అమర్చిన తీరు కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. కార్తిక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయోధ్యకు తరలించారు. ఆరు అంగుళాల ఎత్తు, 5 అంగుళాల వెడల్పు, 4.5 కిలోల బరువుతో ఈ మహా శివలింగాన్ని తనతోపాటు ఆరుగురు శిల్పులు 20 రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు.
తాటిచెట్టు పడి యువకుడికి తీవ్ర గాయాలు
మామిడికుదురు/కాకినాడ క్రైం : ఇంటి వద్ద ఆడుకుంటున్న నగరం గ్రామానికి చెందిన పదిహేనేళ్ల మందపాటి ప్రవీణ్‌పై మంగళవారం తాడిచెట్టు పడి తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు, స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ప్రవీణ్‌కు ప్రాథమిక చికిత్స అందించి రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్న ఈదురు గాలుల తాకిడికి తాడిచెట్టు పడిపోయి యువకుడు గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. జీజీహెచ్ వైద్యులు పరీక్షించి చెట్టు నడుంపై పడటంతో యువకుడి కుడివైపు కిడ్ని పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు. వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
తాడిచెట్టు పడి మహిళ మృతి
మామిడికుదురు: అనారోగ్యంతో ఉన్న బంధువును పలకరించేందుకు వచ్చిన మహిళపై తాడిచెట్టు పడి మృతి చెందిన విషాద ఘటన మాకనపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో మాకనపాలెం గ్రామానికి చెందిన గూడపల్లి వీరవేణు (49) మృతి చెందింది. కొడుకు జానకీరామ్‌తో కలిసి ఆమె స్కూటర్‌పై అదే గ్రామంలో ఉన్న ఆడపడుచు అండలూరి ఆదిలక్ష్మి ఇంటికి వచ్చింది. ఆడపడుచు మనవడు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నాడు. అతడిని పలకరించింది. వారు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు అంత సురక్షితం కాదని భావించి వారిని తుపాను పునరావాస కేంద్రానికి రావాలని చెప్పి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా తుపాను వల్ల వీస్తున్న బలమైన ఈదురు గాలుల ప్రభావంతో ఇంటి పక్కనే ఉన్న తాడిచెట్టు ఒక్కసారిగా పడిపోయింది. స్కూటర్‌పై తల్లి కోసం వేచి చూస్తున్న కొడుకు జానకీరామ్ చెట్టుపడిపోతోందంటూ తల్లిని హెచ్చరిస్తూ ముందుకు వెళ్లడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. కానీ తల్లి వీరవేణు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది. చెట్టు ఆమైపె పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు ఫిర్యాదుపై నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేశారు. పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వీరవేణు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నేతలు వీరవేణు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబానికి సహాయం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


