తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి
అల్లవరం: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పండించిన పంట పాడవకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లోని రైతు విభాగం అధ్యక్షులు రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపాను కారణంగా రైతులు నష్టపోతే వారికి సకాలంలో పరిహారం అందేలా రైతు విభాగాల సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. నష్టానికి సంబంధించిన ఫొటోలు, పూర్తి ఆధారాలు సేకరించాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతాంగ విభాగం ఆధ్వర్యాన క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, నష్టాల అంచనాలతో పత్రికా ప్రకటనలు ఇవ్వాలని, మీడియా సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగానికి రామారావు సూచించారు.


