సమర్థవంతంగా భూముల రీసర్వే చేపట్టండి
తాళ్లరేవు: ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీసర్వే ప్రక్రియను రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ల్యాండ్ సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కె.సూర్యారావు తెలిపారు. గురువారం తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీలో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ భూముల రీసర్వేకు సంబంధించి మూడు రోజుల ముందు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతుల సమక్షంలో వారి సరిహద్దులను పరిశీలించి, ఎటువంటి వివాదాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా ల్యాండ్ సర్వే ఆఫీసర్ కె.శ్రీనివాస్, డీఐఓఎస్ రవిశంకర్, గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, మండల సర్వేయర్ సీహెచ్ నిరంజన్‌రావు, రీసర్వే డీటీ కె.వీరబాబు, డీటీ టి.సూరిబాబు, సర్పంచ్ పంపన రామకృష్ణ పాల్గొన్నారు.
నేడు నూతన ఉపాధ్యాయుల
పరిచయ కార్యక్రమం
అమలాపురం రూరల్: జిల్లాలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవనంలో నిర్వహిస్తున్నట్లు డీఈఓ సలీమ్ బాషా తెలిపారు. జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ మహేష్ కుమార్ మార్గదర్శక ప్రసంగం అందిస్తారన్నారు. విద్యా రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, విద్యార్థుల అభ్యాసన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్రపై కలెక్టర్ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా స్థాయిలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సర్వశిక్ష అభియాన్ తదితర శాఖల ప్రధానాధికారులను ఆహ్వానించారు.
అనుమతి లేకుండా
బాణసంచా విక్రయిస్తే చర్యలు
పి.గన్నవరం: జిల్లాలో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యక్తులపై ఇప్పటి వరకూ 50 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులతో పాటు వివిధ అంశాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అమలాపురం సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. 216 నేషనల్ హైవేలో భట్నవిల్లి నుంచి చించినాడ వరకూ పలు కూడళ్లలో ప్రమాదాల నియంత్రణకు హైవే అధికారులతో చర్చించి రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎస్సై బి.శివకృష్ణ ఉన్నారు.
జిల్లా ఫొటోగ్రాఫర్లకు సేఫ్టీ ఐడీ
అమలాపురం టౌన్: జిల్లా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వృత్తి నిపుణుల భద్రత కోసం సేఫ్టీ ఐడీ స్టిక్కర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ సేఫ్టీ ఐడీ స్టిక్కర్ క్యూఆర్ కోడ్ లింక్‌ను స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గురువారం ప్రారంభించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను జిల్లాలోని ఫొటో, వీడియో గ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను ఫొటోగ్రాఫర్లు తమ వాహనం (బైక్ లేదా కారు)పై అతికించుకోవాలని జిల్లా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ అన్నారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గెడ్డం సురేష్‌కుమార్, కార్యదర్శి దొరబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి గీత రమణ పాల్గొన్నారు.
సమర్థవంతంగా భూముల రీసర్వే చేపట్టండి
సమర్థవంతంగా భూముల రీసర్వే చేపట్టండి


