విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలి
అమలాపురం రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో విపాసన జ్ఞాన సాధన చేపట్టి క్రమశిక్షణ, చదువుల పట్ల ఆసక్తి పెంచుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాల్స్, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. మూడు నెలల విపాసన జ్ఞాన సాధన కార్యక్రమాల ఆనా పానా పురోగతిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు ధ్యానం చేయాలన్నారు. విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు జ్ఞాన ధ్యానం చేయాలన్నారు. విపాసన ఆచార్య నిపుణుడు ప్రహ్లాద మాట్లాడుతూ విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడం ద్వారా జీవితంలో మెరుగైన స్థాయికి ఎదుగుతారన్నారు. జేసీ టి.నిశాంతి, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తి చాటాలి
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి చాటేలా కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ మొదటి వారంలో ప్రాథమిక స్థాయి క్రీడా పోటీలను మండల స్థాయిలోనే పూర్తి చేయాలని, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ క్రీడా పోటీలను జిల్లా స్థాయిలో నవంబరు 12, 13 ,14 తేదీల్లో స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించాలని ఆదేశించారు. 6, 7, 8 తరగతులు జూనియర్స్‌గా, పది, ఇంటర్ తరగతులు సీనియర్స్ బ్యాచ్‌గా విభజించామన్నారు. అండర్– 14, 17 కేటగిరీల్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, వెయిట్, పవర్ లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాశరావు, సీఎంఓ బీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


