సత్యదీక్షలకు నేడు శ్రీకారం
అన్నవరం: ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రత్నగిరిపై ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా కార్తికానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు ప్రారంభమయ్యే సత్యదీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌లకు తెల్లవారుజామున పంచామృతాభిషేకం చేస్తారు. అనంతరం సత్యదీక్షలు ప్రారంభమవుతాయి. స్వామి సన్నిధిలోనే అర్చకులతో మాలలు వేయించుకుని, భక్తులు ఈ దీక్షలు చేపడతారు. అలా వీలు కాకపోతే ఏదైనా దేవాలయంలో అర్చకుల ద్వారా, ఇంట్లో తల్లి ద్వారా మాల ధరించి ఈ దీక్ష చేపట్టే వీలుంది. 27 రోజుల అనంతరం నవంబర్ 13న స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు సత్యదేవుని సన్నిధిలో ఇరుముడి సమర్పించి, దీక్ష విరమణ చేయాలి. అనంతరం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామిని దర్శించడంతో దీక్ష పూర్తవుతుంది.
18 రోజులు, 9 రోజులు చేపట్టే అవకాశం
కాగా, 27 రోజుల దీక్ష చేపట్టే అవకాశం లేని వారు 18 రోజులు, 9 రోజులు కూడా చేపట్టవచ్చు. అయితే దీక్ష విరమణ మాత్రం నవంబర్ 13న మాత్రమే చేయాలి. 18 రోజుల దీక్షను ఈ నెల 26న, 9 రోజుల దీక్షను నవంబర్ 4న స్వీకరించవచ్చు. నవంబర్ 12వ తేదీ రాత్రి రత్నగిరిపై సత్యదీక్ష స్వాములతో సత్యదేవుని పడిపూజ నిర్వహిస్తారు.
ప్రచార లోపం
ఏటా సత్యదీక్షల గురించి కనీసం 15 రోజుల ముందే సత్యరథం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేవారు. అలాగే, ఏజెన్సీలో సత్యదీక్ష చేపట్టే గిరిజన స్వాములకు దీక్షా వస్త్రాలు పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందువల్లనో కానీ సత్యదీక్షలపై పెద్దగా ప్రచారం చేయలేదు. వారం రోజులు ముందు మాత్రమే సత్యరథంతో ప్రచారం చేయించారు. దీక్షా వస్త్రాల పంపిణీ కూడా ఆలస్యంగానే ప్రారంభించారు. దీనిపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దీక్షలు చేపట్టే వారికి దేవస్థానం తగు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.


