హోటళ్లపై ఆకస్మిక దాడులు
అమలాపురం టౌన్: అమలాపురంలోని మాంసాహార హోటళ్లపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై మున్సిపాలిటీతో పాటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు స్పందించారు. పట్టణంలోని ప్రధాన హోటళ్లయిన విష్ణుశ్రీ, జీకే గ్రాండ్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారి వై.రామయ్య, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ తమ సిబ్బందితో గురువారం ఆకస్మికంగా దాడులు చేశారు. విష్ణుశ్రీ హోటల్‌లో పారిశుధ్య నిర్వహణ బాగోలేదని రామయ్య అన్నారు. దీనిపై ఆ హోటల్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసి, రూ.5 వేల జరిమానా విధించారు. జీకే గ్రాండ్‌లో కొన్ని లోపాలపై ఆ హోటల్ యాజమాన్యానికి సూచనలు చేశారు. ఇటీవల పలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతోపాటు పలువురు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు అమలాపురంలోని ఓ హోటల్ పలావు ప్యాకెట్‌లో మండ్ర కప్ప అవశేషాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో బుధవారం ప్రచారం జరగడంతో ఈ దాడులు చేసినట్లు సమాచారం. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ వెంకటేష్, వార్డు సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు వంకాయల సతీష్, కె.ఈశ్వరరావు, మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


