వచ్చే నెల 22న అమలాపురం జెడ్పీ స్కూల్ వార్షికోత్సవం
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవాన్ని వచ్చే నెల 22న పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు వెల్లడించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ గురువారం మీడియాతో మాట్లాడారు. వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకన్నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివి నేడు ఉన్నత పదవులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించామన్నారు. నవంబర్ 22న సాయంత్రం నుంచి పాఠశాల వార్షికోత్సవ వేదికపై ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావుల ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పలు సాంస్కృతి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఓ పండుగలా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరికై నా ఆహ్వానం అందకపోతే కార్యక్రమం మనదన్న భావనతో పూర్వ విద్యార్థులంతా హాజరు కావాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.


