ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ– పంట, ఈకేవైసీ నమోదు చేయాలన్నారు. పంట కోతల తేదీల ఆధారంగా రైతులకు కూపన్లు జారీ చేయాలన్నారు. జేసీ నిషాంతి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 లేదా కంట్రోల్ రూమ్ నంబర్లు 83094 32487, 94416 92275లలో సంప్రదించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ.ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రెండు దశల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సంబంధిత గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. పీఎం ఏజీవై పథక అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి, పారిశుధ్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి పాల్గొన్నారు.
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సుమారు 110 అర్జీలను కలెక్టర్‌తో పాటు జేసీ టి.నిషాంతి, డీఆర్డీఓ కె.మాధవి, డ్వామా పీడీ మధుసూదన్‌లు స్వీకరించారు. సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఈఓ షేక్ సలీం బాషా, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏవీఎస్ రామన్ పాల్గొన్నారు.


