బాణసంచా బాధిత కుటుంబాలను ఆదుకోండి
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కపిలేశ్వరపురం (మండపేట): రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల సంభవించిన ప్రమాదంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణలతో కలసి విలేకరులతో మాట్లాడారు. బాణసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు సంబంధిత నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పని ప్రదేశంలో ఉండే కార్మికులకు తప్పనిసరిగా బీమా చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, నాయకులు పిల్లా వీరబాబు, మందపల్లి రవికుమార్, జొన్నపల్లి సత్తిబాబు, తణుకు అశోక్, యరమాటి వెంకన్న బాబు, టేకుమూడి శ్రీనివాస్, ముమ్మిడివరపు బాపిరాజు, టపా పుల్లేశ్వరరావు, కుడిపూడి రాంబాబు, నాగులపల్లి రామకృష్ణ, చిన్ని గంగాధరం, కొడమంచిలి భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


