
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్‌పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్‌పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్‌రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు.
చరిత్ర తెలుసుకుని మాట్లాడండి
1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు.
ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి
ఫ వైఎస్సార్ సీపీ యువజన
విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్