బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు

Railway Employee Shot Inside Bank By Security Guard Not Wearing Mask - Sakshi

లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్‌ మాస్క్‌ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తు‍న్న రాజేశ్‌ కుమార్‌ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్‌ ఫేస్‌మాస్క్‌ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ అడ్డగించాడు. మాస్క్‌ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్‌, సెక్యూరిటీ గార్డ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్‌ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్‌ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్‌ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్‌ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్‌ మాస్క్‌ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్‌ఫైర్‌ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్‌ పోలీసులకు వివరించాడు. 
చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top