గంట గంటకు డబ్బులు జమ అన్నారు.. మొదట్లో బాగానే ఉంది.. తర్వాత డ్రా చేద్దామంటే..

Online Fraud In Hug Sleep App - Sakshi

రామన్నపేట: అత్యాశకు పోయి ఆన్‌లైన్‌ మోసానికి బలై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సైబర్‌ మోసానికి బలైనవారు ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోనే 1500 నుంచి 2వేల మంది వరకు ఉన్నారు. డిసెంబర్‌ 14న హగ్‌స్లీప్‌ అనే యాప్‌ మార్కెట్‌లోకి వచ్చింది. లింక్‌ ద్వారా ఒకరి ఫోన్‌ నుంచి మరొకరికి పంపేలా యాప్‌ను రూపొందించారు.

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయగానే వివిధ డిస్కౌంట్లతో కూడిన కూపన్లు ప్రత్యక్షమవుతాయి. వాటిని స్క్రాచ్‌ చేయగానే డిస్కౌంట్‌ చూపిస్తుంది. ఓకే చేస్తే డిస్కౌంట్‌ పోనూ మిగిలిన మొత్తం సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అవుతుంది.   

డిస్కౌంట్ల పేరిట మస్కా 
హగ్‌స్లీప్‌ యాప్‌లో రూ.3 వేలు, రూ.6 వేలు, రూ.9 వేలు, రూ.15 వేలు, రూ.25 వేల విలువైన కూపన్లను పొందుపరిచారు. రూ.3 వేలు డిపాజిట్‌ (బదిలీ) చేస్తే గంటకు రూ.20.80 చొప్పున కేవలం 45 రోజుల్లో రూ.22 వేలు పొందవచ్చని, రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తే గంటకు రూ.117.90 చొప్పున 60 రోజుల్లో రూ.1,50,000 పొందవచ్చని బంపర్‌ డిస్కౌంట్లను ఎర వేశారు.


యువతను బురిడీ కొట్టించిన హగ్‌ స్లీప్‌ యాప్‌ 

రూ.6 వేలకు గంటకు రూ.40, రూ.9వేలకు గంటకు రూ.60, రూ.15 వేలకు గంటకు రూ.90 స్క్రాచ్‌ చేసిన వ్యక్తి ఖాతాలో జమ అవుతాయని, ఖాతాలో పడిన మొత్తాన్ని రోజూ ఉదయం పదకొండు గంటల తరువాత డ్రా చేసుకోవచ్చని ఆశ చూపారు. ఉదాహరణకు రూ.3 వేల విలువైన కూపన్‌ను గనక స్క్రాచ్‌ చేస్తే డిస్కౌంట్‌ 20శాతం పోను మిగిలిన రూ.2400 సదరు వ్యక్తి ఖాతా నుంచి యాప్‌ ఖాతాకు బదిలీ అవుతాయి. డిస్కౌంట్‌కు సంబంధించిన రూ.600 లింక్‌ పంపిన వ్యక్తి ఖాతాకు వెళ్తాయి.  

అత్యాశతో ఎగబడిన జనం 
మొదట్లో చేరిన కొద్దిమంది ఖాతాల్లో గంట గంటకు డబ్బులు జమ అయ్యాయి. వారు తమ స్నేహితులు, బంధువులకు లింక్‌ను పంపి డౌన్‌లోడ్‌ చేయించి స్కీంలో చేరేలా ప్రోత్సహించారు. కొందరు తమది గ్యారంటీ అని కూడా ప్రోత్సహించారు. దీంతో యువకులు తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ఫోన్లలో లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసి మరీ డబ్బులు బదిలీ చేశారు. యాప్‌లో చేరిన వారిలో ఎక్కువమంది రూ.20 వేల కూపన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.కేవలం రామన్నపేట మండలంలోనే రెండు వేలకు మందికి పైగా స్కీంలో చేరి రూ.2 కోట్లు డిపాజిట్‌ చేశారు.

డిసెంబర్‌ 27 తరువాత స్కీంలో చేరిన వారు గంట గంటకు వచ్చిన డబ్బులను డ్రా చేద్దామని ప్రయత్నించగా యువర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఈజ్‌ ప్రాసెసింగ్‌ చూపించింది. డిసెంబర్‌ 31న యాప్‌ పూర్తిగా మూతపడింది. దీంతో డబ్బులు బదిలీ చేసినవారు బిక్కమొహం వేశారు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న వారిలో రాజకీయ నేతలు, వ్యాపారులతోపాటు రోజువారీ కూలీలు కూడా ఉన్నారు. తాము ఆన్‌లైన్‌ మోసానికి బలయ్యామనే విషయాన్ని బయటికి చెప్పలేక కుమిలిపోతున్నారు. దీనిపై రామన్నపేట ఎస్‌ఐ వెంకటయ్యను వివరణ కోరగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top