
కాకినాడ క్రైం: వలంటీర్‌ను పావుగా చేసిన ఓ సైబర్ కేటుగాడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఐదు నిమిషాలు మాట్లాడి రూ.27 వేలు దోచేశాడు. వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు కొమ్మిరెడ్డి వారి వీధికి చెందిన దింటకుర్తి సాత్విక్ సూరంపాలెం ఆదిత్య కళాశాలలో గతేడాది బీటెక్ పూర్తి చేశాడు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా అతడికి 2019, 2020 విద్యా సంవత్సరాలకు రూ.20 వేలు ఖాతాకి జమకావల్సి ఉంది. బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ నంబరు తప్పుగా ఇవ్వడం వల్ల తన ఖాతాలో విద్యాదీవెన నిధులు జమకాలేదని ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్‌కు కొద్ది నెలల క్రితం ఫిర్యాదు చేశాడు. సవరణకు అవకాశం ఇవ్వాలని విన్నవించాడు. తమ వలంటీర్ 7సి క్లస్టర్ 36వ వార్డుకు చెందిన ఆరీఫ్‌కి తెలిపాడు. వలంటీర్ సచివాలయం ద్వారా ప్రభుత్వానికి నివేదించాడు.
నమ్మకంగా వివరాలు రాబట్టి మోసం
ఇదిలావుంటే...ఆదివారం మధ్యాహ్నం వలంటీర్ ఆరిఫ్‌కు 97922 40869 నంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ప్రభుత్వ సర్వే విభాగం నుంచి ఫోన్ చేస్తున్నానని తన పేరు టి.హరీశ్ కుమార్ అని చెబుతూ వెలుగు ఆఫీస్ నుంచి అసిస్టెంట్ మేనేజర్‌ని కాల్ చేస్తున్నానని చెప్పాడు. సర్వే కాల్స్ వలంటీర్లకు సాధారణమే కావడంతో వలంటీర్ ఆ వ్యక్తిని నమ్మాడు. తన పరిధిలో వివిధ పథకాల్లో లబ్ధిదారులకు పథకాలు అందని వారి వివరాలను ఇవ్వాలని కోరగా సాత్విక్ వివరాలు తెలిపాడు. వలంటీర్ ఆరీఫ్ విద్యార్థి తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ మాట్లాడి కుమారుడు సాత్విక్‌కు ఇచ్చాడు. అప్పటికే సాత్విక్ నంబర్ తీసుకున్న ఆ వ్యక్తి ఆ కాల్ కట్ చేసి తిరిగి సాత్విక్‌కు 78385 40706 నంబర్ నుంచి కాల్ చేశాడు. విద్యకు సంబంధించిన వివిధ వివరాలు అడిగాడు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని ఇప్పటికిప్పుడే నగదు బదిలీ చేస్తామని చెప్పాడు. విద్యార్థి సాత్విక్ కేటుగాడి మాటలు నమ్మాడు. అయితే తొలిగా ఫోన్‌పే ఖాతా ఉందని నిర్థారించుకొని తమ అకౌంట్ నంబర్‌ను యాడ్ చేసుకోవాలని సూచించాడు. నీకు మొత్తం రూ.20 వేలు రావలసి ఉంది కాబట్టి అదే రూ.20 వేలు మొత్తాన్ని చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని అయితే ఆ మొత్తం జమకాదని ప్రభుత్వ ఖాతా కావడం వల్ల డిపాజిట్లకు ఆస్కారం ఉండదని, పెండింగ్ అని వచ్చి తిరిగి నీ నగదు నీ ఖాతాలోనే ఉంటాయని చెప్పాడు. ఇది కేవలం అకౌంట్ నంబర్‌ను నిర్థారించుకునేందుకు ఓ ప్రక్రియ అంటూ నమ్మబలికాడు. నిజమేనేమోనని భావించిన సాత్విక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ బ్యాంకు వివరాలు చెప్పండి సార్ రాసుకొని చెప్పినట్లు చేస్తానన్నాడు.
అలా చెప్పడం కుదరదని ఇది ప్రభుత్వ ఖాతా అని మరో ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తే నీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చెయ్యాలో చెబుతానని అన్నాడు. అన్నట్టుగానే సాతి్వక్ పొరుగు వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో కాల్ చేశాడు. తొలుత రూ.19,999 పంపాడు. ఆ వ్యక్తి అన్నట్లుగా పంపిన వెంటనే పెండింగ్ అని వచ్చింది. లేదు, అకౌంట్ నంబర్ ఇంకా నిర్థారణ అవ్వలేదు మరో రూ.7 వేలు పంపాలని కోరాడు. నిజమేనేమోనని మరో రూ.7 వేలు పంపాడు. ఈ సారి అకౌంట్ నంబర్ నిర్థారణయిందని చెప్పాడు. ఉన్నట్టుండి వీడియో కాల్ కట్ చేశాడు. అలా కాల్ ముగిసిన తర్వాతి నిమిషంలో రెండు దఫాల్లో పంపిన రూ.27 వేల మొత్తం జమయిందని పేర్కొంటూ ‘ పేమెంట్ సక్సెస్ ’ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో కంగారు పడ్డ విద్యార్థి తనకి కాల్ వచ్చిన అదే నంబర్‌కు తిరిగి కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. లబోదిబోమంటూ తండ్రికి చెప్పగా వలంటీర్‌ను ఆశ్రయించారు. వలంటీర్‌కు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు, తండ్రి, వలంటీర్, ఉన్నతాధికారులు కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడి పేరు ట్రూ కాలర్‌లో కన్హయ్య లాల్ అని, ఫోన్ పేలో ఖజన్‌సింగ్ అని వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ డీఎస్పీ ద్వారా జిల్లా ఎస్పీకి సైబర్ నేరం వివరాలు పంపారు. జిల్లా పోలీస్ ఐటీ విభాగం నిందితుడి జాడ కోసం విచారణ చేపట్టింది.