
ఈనెల 15 వరకు ఇన్‌స్పైర్ మనక్ గడువు
చిత్తూరు కలెక్టరేట్ : ఇన్‌స్పైర్ మనక్ 2025–26లో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్ కు దరఖాస్తు చేసుకునేలా హెడ్‌మాస్టర్లు చర్యలు చేపట్టాలని డీఈవో ఆదేశించారు.
ఉద్యోగ మేళాకు స్పందన
కార్వేటినగరం : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ ఏపీ ఎస్.ఎస్.డి.సి సంయుక్తంగా శనివారం కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టరేట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఆనంద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి , సీడాప్ – ఏపీఎస్‌ఎస్డీసీ అధికారులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. మొత్తం 178 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 86 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు.
భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి గణపత్రి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తులతో జరిపించారు.
స్వర్ణరథంపై స్వామివారు...
స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి శనివారం రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి ఊరేగించారు.
మిలటరీ స్కూళ్లలో
ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.