పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి

Jul 7 2025 6:15 AM | Updated on Jul 7 2025 6:15 AM

పెండి

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి

చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంపై ప్రతి ఒక్క న్యాయమూర్తి దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆదేశించారు. చిత్తూరు కోర్టు భవనంలో ఆదివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లా న్యాయాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత నెలాఖరు నాటికి జిల్లాలో 96,739 పెండింగ్‌ కేసులు ఉండగా, ఇందులో 48,751 సివిల్‌, 47,988 క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్‌ ఉండడంపై రాష్ట్ర హైకోర్టు సైతం గమనిస్తోందన్నారు. ప్రధానంగా వృద్ధులకు సంబంధించిన కేసులు, అనుమతి లేని విచారణ ఖైదీల కేసులపై దృష్టి సారించాలన్నారు. న్యాయస్థానాలు జారీ చేసిన వారంట్లు ఏ మేరకు అమలు చేశారో సరి చూసుకోవాలన్నారు. జిల్లాలోని సీనియర్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులకు పెండింగ్‌ కేసులు పరిష్కరించడానికి లక్ష్యాలు కూడా నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు హాజరయ్యారు.

ఏరియా ఆస్పత్రిలో యువకుడి హల్‌చల్‌

పలమనేరు: మద్యం మత్తులో ఉన్న యువకుడు సైకోలా మారి హల్‌చల్‌ చేసిన సంఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దండపల్లి మండలం కురప్పల్లెకు చెందిన భాను(25) భార్యతో కలిసి పట్టణంలోని గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్యపై దాడిచేశాడు. దీంతో ఆమెను బంధువులు స్థానిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే భర్త ఆస్పత్రికి వచ్చి మరీ భార్యతో గొడవపడి గట్టిగా కేకలు పెడుతూ చొక్కా తీసిపడేసి, అక్కడున్న వారిని తరుముకున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వారు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి ఓ చెట్టుకు కట్టేశారు.

భక్తులపై హిజ్రాల దాడి

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనం కోసం ఆటోలో వచ్చిన ఐదుగురు భక్తులు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని హిజ్రాలు వారిపై దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆటోలో బోయకొండకు బయల్దేరారు. బోయకొండ సమీపంలోని మేకలవారిపల్లె వద్ద రోడ్డుపై వెళ్తున్న వాహనాలను హిజ్రాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వారు ఇవ్వకుండా అక్కడి నుంచి బోయకొండ రణభేరి గంగమ్మ ఆలయం సమీపం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న మరి కొందరు హిజ్రాలు డబ్బులు ఇచ్చి ఆటో ముందుకెళ్లాలని పట్టుబట్టారు. వారు అడిగినంత ఇవ్వలేదని బూతులు తిడుతూ, ఆటోలో ఉన్న దేవరాజు, మంగమ్మ, భవాని, లిఖిత, నారాయణస్వామి లపై హిజ్రాలు దాడిచేసి గాయపరిచారు. వారు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరికొందరు భక్తులు వారిని రక్షించారు. అక్కడ విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌కు భక్తులు ఫిర్యాదు చేశారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి 
1
1/2

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి 
2
2/2

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement