
అసలు సిసలైన నాయకుడు జగనే
● హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే ● ఇది ప్రజలకు తెలియజేయడమేరీకాలింగ్ మేనిఫెస్టో ఉద్దేశం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా
నగరి : అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అసలు సిసలైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. నగరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఆర్‌కే రోజాతో కలిసి క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్‌మోహన్ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్ తప్ప ఏమీ అందిచలేదన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారని దుయ్యబట్టారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. గెలిచాక యథాప్రకారం ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఎన్ని హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశమన్నారు. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యతన్నారు.
సనాతన యోధుడు ఏమయ్యాడు
తిరుమలలో దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, శ్రీ కూర్మంలో తాబేళ్లు చనిపోతున్నాయని వీటిపై సనాతన యోధుడు పిఠాపురం పీఠాధిపతి పవన్ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఆయన తమిళనాడుకెళితే తాను అక్క డే పుట్టానంటాడు.. గుంటూరుకు వెళితే అక్కడా పుట్టానంటాడు.. పిఠాపురం వెళితే అక్కడే పుట్టానంటున్నాడు.. అసలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అందరూ వీకెండ్‌కు వెకేషన్‌కు వెళితే, పవన్ వీకెండ్‌కు మాత్రమే రాష్ట్రానికి వస్తారన్నారు. ఎవరు రాష్ట్రానికి మంచిచేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, విజయలక్ష్మి, దీప, వైస్‌చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పవన్ తిక్కకు బాబు లెక్కలు
పవన్ తిక్కకు చంద్రబాబు వద్దే లెక్కుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ హామీలు నెరవేర్చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతమంది ఉంటే అంత మందికి జగన్ చేసిన సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తాం అంటూ ఎన్నికల బీరాలు పలికిన బాబు నేడు దీన స్వరంతో పథకాలు తలచుకుంటే భయమేస్తోందంటున్నారని ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని పేర్కొన్నారు. ఆయనకు నిజం చెబితే తల పగిలే శాపం ఉందేమో అన్నారు. అందుకే ఆయన అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. బాబు చంకలో కూర్చున్న పవన్ తానే టీడీపీని అధికారంలోకి తెచ్చానంటుంటే, తాము లేకుంటే పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరని టీడీపీ చెబుతోందని, ఇలాంటి నాయకులందరూ కూటమిగా కొనసాగుతుండడం దౌర్భాగ్యమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తానన్నారు. ఇంత మంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు బలవుతున్నా నోరుమెదపడం లేదేమిటని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు చూపే గ్రాఫిక్స్ తప్ప మిగతా విషయాలు ఏవీ కనబడవన్నారు.