
నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పోలీసు
కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
9న సార్వత్రిక సమ్మె
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జిల్లాలో సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆదివారం ఐసీడీఎస్ సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. దీనికి నిరసనగా చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఈ సమ్మెలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎన్నికల జాబితాపై
బీఎల్‌వోలకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఎల్‌వో (బూత్ లెవల్ ఆఫీసర్)లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఈ నెల 5 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఇచ్చేలా కలెక్టరేట్ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్‌వోల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం ప్రతి రోజు 50 మందికి మించకుండా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ శిక్షణలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేపట్టాల్సిన చర్యలను బీఎల్‌వోలకు క్షుణ్ణంగా వివరించనున్నారు.