
● ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ● ఉద్య
తిరుపతి సిటీ : ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భద్రత కరువై బతుకు భారంగా మారింది. కళాశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు తప్ప మిగిలిన డిగ్రీ, టీటీడీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. 2025–26 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అధ్యాపకులు మే నుంచి జులై వరకు మూడు నెలల జీతాలకు నోచుకోలేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 2002 నుంచి పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 800 మందికి పైగా అధ్యాపకులు ఉద్యోగ భద్రత కరువైె చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు.
గత ప్రభుత్వం పర్మినెంట్‌కు ఆదేశాలిచ్చినా..
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు 2024లో జీఓ 114 విడుదల చేసి ప్రక్రియ శర వేగంగా కొనసాగుతున్న తరుణంలో సాధారణ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టి డిగ్రీ అధ్యాపకుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ ద్వారా నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అయోమయంలో పడింది. రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికై న అధ్యాపకులతో తాత్కాలిక అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. కొంత మంది అధ్యాపకులు గత 22 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ రెగ్యులర్ చెయ్యకపోవడం కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వకపోవడం దారుణం.
రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ కళాశాలలో 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోలేక సతమతమతం అవుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 75 మంది తాత్కాలిక అధ్యాపకులు రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అటు పర్మినెంట్ చేయకపోగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించకపోవడంతో వారికి ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా 12 నెలల పాటు అధ్యాపకుల చేత సేవ చేయించుకుని కేవలం 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు వేతనాలు సరైన సమయానికి అందించకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నారు.
ఏటా నాలుగు నెలల నిరీక్షణ
గతంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి రెన్యూవల్ ఆర్డర్స్ వచ్చేవి. గత ఏడాది నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ కళాశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి కాకుండా మూడు నెలలు ఆలస్యంగా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం నాలుగు నెలలు జీతభత్యాలు ఆలస్యమవడంతో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రక్రియ పూర్తయే వరకు నూతన రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం 2025–26 సంత్సరానికి సంబంధించి తాత్కాలిక అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. దీంతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్న సబ్జెక్ట్‌లకు వదిలేసి ఖాళీగా ఉన్న సబ్జెక్ట్‌లకు మాత్రమే నూతన రిక్రూట్‌మెంట్ ద్వారా అధ్యాపకుల ఎంపిక చేయాలి. – డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు,
తిరుపతి జిల్లా