
త్వరలో సంఘాలకు సారథులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్లె ప్రాంతాల్లోని రైతులకు అండగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్వరలో సారథులు రాబోతున్నారు. ప్రస్తుతం పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా సంబంధిత శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. వారి స్థానంలో త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిధిలో 75 సహకార సంఘాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక త్రీమెన్ కమిటీలను రద్దుచేసి సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. వీరు తగినంతమంది లేక మూడు, నాలుగు సంఘాలకు ఒకరిని చొప్పున నియమించడంతో సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారు. వీరి గడువు ముగిసింది. మళ్లీ ఆరు నెలలకు పెంచాలి. ఈ దఫా నెల రోజులే పొడిగించారు. ఈ సమయంలో త్రిసభ్య కమిటీల నియామకాన్ని కొలిక్కి తీసుకురానున్నారు.
పోటాపోటీగా ఆశావహులు
ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలో చైర్మన్, డైరక్టర్లుగా నియమించేందుకు మూడు నెలల క్రితమే ఆశావహుల పేర్లు తీసుకున్నారు. ఎమ్మెల్యేలే జాబితాలను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. కొన్నిచోట్ల కూటమి నేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఇన్నాళ్లు వాటిని పక్కన పెట్టేశారు. కమిటీలో పేర్లున్న ఆశావహులంతా ఈ పదవుల కోసం రెండు నెలలుగా వేచి చూస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా సంఘాలన్నింటికీ కమిటీలు వేయబోతున్నారు. తర్వాత ఎన్నికలు నిర్వహించినా అప్పుడు కూడా వీరినే అధ్యక్షులుగా కొనసాగించేలా అభ్యర్థులను ఎంపికచే యాలని, తేడాలుంటే ఇప్పుడే సరిదిద్ది మరో సారి జాబితాను పునఃపరిశీలన చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ విషయంలో కూటమి నేతల్లో లుకలుకలు మొదలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.