
చదువుకు దారేది?
పూర్తిగాని అండర్ పాస్ రోడ్డు
● దారి లేక పాఠశాలకు వెళ్లని విద్యార్థులు
● 24 గంటల్లో తాత్కాలిక పనులు పూర్తిచేస్తామని హామీ
రొంపిచెర్ల: జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. దారిలేక పాఠశాలకు హాజరుకాలేని దుస్థితి రొంపిచెర్ల మండలం, బండకిందపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. మదనపల్లె నుంచి రంగంపేట వరకు నేషనల్ హైవే రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికారులు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో బండకిందపల్లె యూపీ పాఠశాల ముంపునకు గురికాగా.. ప్రభుత్వం రూ.37 లక్షలు నష్ట పరిహారంగా మంజూరు చేసింది. అధికారులు నేషనల్ హైవే రోడ్డు పక్కనే తరగతి గదులను నిర్మించారు. సుమారు 54 మంది విద్యార్థులు రోజూ వచ్చి వెళ్లేవారు. పాఠశాలలో నలగురు ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. ఇంతవరకు రోడ్డు పైనే దాటుకుని విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే వారు. రోడ్డు పనులు పూర్తి కావడంతో రోడ్డు మీద దాటే అవకాశం లేకుండా పోయింది. అండర్ పాస్ రోడ్డు వేయాల్సిన అధికారులు దానిని విస్మరించడంతో విద్యార్థులు రెండు కిలో మీటర్ల దూరం చుట్టుతిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జేసీకి, ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు అండర్ పాస్ పనులను పట్టించుకోక పోవడంతో మంగళవారం విద్యార్థులను పాఠశాలకు పంపకుండా తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు రాక పోవడంతో చేసేది లేక ఖాళీగానే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే పాఠశాలకు విద్యార్థులు రాక పోవడంతో వంట గది కూడా మూత పడింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాసులు, తహసీల్దార్ అమరనాఽథ్ బండకిందపల్లె పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, నేషనల్ హైవే సూపర్‌వజర్ విజయకుమార్‌తోనూ మాట్లాడారు. అండర్ పాస్ పనులను తాత్కలికంగా 24 గంటల్లో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని నేషనల్ హైవే సూపర్‌వైజర్ హామీ ఇచ్చారని తహసీల్దార్ తెలిపారు.

చదువుకు దారేది?