
మొక్కుబడిగా ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించిన మొదటి సమావేశాన్ని జిల్లా లోని 22 ప్రైవేట్ స్టడీ సెంటర్ల నిర్వాహకులు బాయ్‌కాట్ చేశారు. ఈ సమావేశం నిర్వహణకు ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారి నరహింహరావు హాజరయ్యారు. అయితే జిల్లాలోని ప్రైవేట్ స్టడీ సెంటర్ నిర్వాహకులు ఒక్కరు సైతం హాజరుకాలేదు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థల కో ఆర్డినేటర్లతోనే తూతూమంత్రంగా సమావేశం నిర్వహించేశారు. సంబంధిత 22 సెంటర్లలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్‌లు చేసేదిలేదంటూ పలువురు స్టడీ సెంటర్ల నిర్వాహకులు వెల్లడించారు.
చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం
మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ వరం లాంటిదని డీఈఓ వరలక్ష్మి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ నరసింహరావులు తెలిపారు. డీఈవో కార్యాలయంలో ఏఐ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్‌ల పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పదో తరగతిలో చేరేందుకు 14 సంవత్సరాలు, ఇంటర్‌కు 15 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని చెప్పారు. ఏడీ–2 వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.