ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం

Jul 4 2025 4:00 AM | Updated on Jul 4 2025 4:00 AM

ఘనంగా

ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం

తిరుపతి సిటీ : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ ఉపాధ్యక్షులు పవన్‌ జి చందక్‌, కౌన్సిల్‌ సభ్యుడు సీఎస్‌ మోహన్‌ కుమార్‌, సీఎస్‌ వెంకటరమణ, ఐసీఎస్‌ఐ ఎస్‌ఐఆర్‌సి చైర్మన్‌ సీఎస్‌ మధుసూధనన్‌, ప్రీతి కౌశిక్‌ బెనర్జీ పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు

ముందస్తు భద్రతా చర్యలు

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్‌రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లేపాక్షి ఏరియా బాలాజీనగర్‌, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్‌–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్‌ స్క్వాడ్‌తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్‌ శేఖర్‌, సీఐలు విజయ్‌ కుమార్‌, శ్రీరాముడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి

గూడూరు రూరల్‌ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. రూరల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

తపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం

తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్‌ తపాలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డె వలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రంజిత్‌ కుమార్‌ను 93907 36277 నంబర్‌ నందు సంప్రదించాలని సూచించారు.

ఇంటర్‌ ప్రవేశాల

గడువు పొడిగింపు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్‌ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఐఓ కోరారు.

ఐఐహెచ్‌టీ స్పాట్‌ అడ్మిషన్లు

వెంకటగిరి రూరల్‌:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌ లూమ్‌ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్‌ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్‌డీ గిరిధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం1
1/1

ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement