
రేషన్ బియ్యం పట్టివేత
– 20 టన్నుల బియ్యం స్వాధీనం
నాయుడుపేటటౌన్ : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గురువారం నాయుడుపేట అర్బన్ సీఐ బాబి సిబ్బందితో తనిఖీ చేపట్టి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి లారీలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ బాబి , సిబ్బందితో పట్టణ పరిధిలోిని జాతీయ రహదారి కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బియ్యం బస్తాల లోడుతో వస్తున్న లారీని నిలిపి పరిశీలన చేశారు. లారీలో రేషన్ బియ్యం బస్తాలు ఉండడాన్ని సీఐ గుర్తించి బియ్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ వేనాటి గజేంద్రను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అలాగే దిలీప్‌రెడ్డి అనే వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో ప్రధాన సూత్రదారిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. పోలీసులు పట్టుకున్న బియ్యం లారీలో రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసే బస్తాలలోనే ఉండడంతో వాటిని రేషన్ షాపులు, లేదా నేరుగా గోదాముల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్‌తో పాటు దిలీప్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకున్న 400 బస్తాల (20 టన్నులు) రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులకు అప్పగించడంతో వాటిని స్థానిక సివిల్ సప్లయి గోదాములో భద్రపరిచారు.