● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
●
రేణిగుంట బీసీ హాస్టల్‌లో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు
ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది.
వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్‌లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి.
– బియ్యపు మధుసూదన్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి
హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే
హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి.
– చంద్రశేఖర్, ప్రగతి సంస్థ
మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి
ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’
శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు.
పర్యవేక్షణ లోపించి..
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి తోడు మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు విద్యార్థుల మెతుకుల్లో కక్కుర్తి చూపుతూ విద్యార్థులను తరచూ అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్‌లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది విద్యార్థులు ఆస్పత్రికి చేరారు. విద్యార్థులు తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఎప్పుడైన ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు హాస్టళ్ల పనితీరుపై తనిఖీలు చేయకపోవడంతో విద్యార్థులు సమస్యల లోగిళ్లలో చదువు బండి లాగుతున్నారు.
వార్డెన్ సస్పెన్షన్
– ఇన్‌ఛార్జిగా విజయ
శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్‌ఛార్జిగా విజయను నియమించారు. వంటమనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం