
సిద్ధమవుతున్న ఓఆర్‌ఎం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో ఎస్‌పీఎం (ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్‌ఎం(ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఇన్‌స్టాలేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ప్రభుత్వంలో రూ.50 లక్షల వ్యయంతో 2వేల లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్ల ఆయిల్‌ను శుద్ధి చేసే మిషన్‌ను రేణిగుంటకు కేటాయించారు. అక్కడ ఎస్‌పీఎం మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. రాయలసీమలోనే చిత్తూరులో మొదటి మిషన్‌ను పెట్టారు. కానీ దాదాపు 8 నెలలుగా ఇన్‌స్టాల్ చేయకుండా కాలయాపన చేశారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే రైతుల ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో బాగుచేసి పంపవచ్చు. కానీ ఎస్‌పీఎంలో నిరుయోగంగా వదిలివేయడంతో గతంలో ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన అధికారులు టెక్నీషియన్లను పిలిపించి ఇన్‌స్టాలేషన్ పనులు చేపట్టారు. పనులను టెక్నికల్ ఈఈ జగదీష్, ఎస్‌పీఎం డీఈ రవి, ఏఈ మోహన్‌శెట్టి పర్యవేక్షించారు. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఉరి వేసుకుని మహిళ మృతి
పుంగనూరు(చౌడేపల్లె): మనస్తాపంతో ఓ మహిళ ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. సీఐ కథనం.. మండలంలోని పట్రపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు భార్య సరస్వతి(35) కుమార్తె ప్రేమలో పడి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైంది. సరస్వతి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
సమ్మెకు తాత్కాలిక బ్రేక్
రిలే దీక్షలు కొనసాగించనున్న
స్విమ్స్ కార్మికులు
తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు.
అత్తపై అల్లుడి దాడి
– అత్తకు తీవ్ర గాయాలు
నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు.