
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
– తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన
3వ అంతర్జాతీయ సమావేశం
ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్‌లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్‌ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్‌ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్‌జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.