తవణంపల్లె : జిల్లాలో అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నట్లు జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం డీడీ డాక్టర్ వాసు తెలిపారు. బుధవారం తవణంపల్లె, గుడిపాల, పెనుమూరు మండలాల్లోని అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన 10 కోడె దూడలను సేకరించి నకరేకల్ వీర్య కేంద్రానికి పంపినట్లు తెలిపారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత ఇస్తున్నట్లు వివరించారు. పాల దిగుబడి పెంచే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, ధృఢమైన సంకరజాతి పశుసంపదను ఉత్పత్తి చేయడంలో జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. డీడీతో పాటు వెటర్నరీ డాక్టర్ రామయోగానందారెడ్డి, డాక్టర్ మౌనిక, సూపర్‌వైజర్ శివకుమార్ పాల్గొన్నారు.
సర్వ దర్శనానికి
10 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.