
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
గంగాధర నెల్లూరు: రాష్ట్రంలో మోసం అని పదం వినపడితే చంద్రబాబు గుర్తుకు వస్తారని, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం గంగాధర నెల్లూరు మండలంలోని వింజం పంచాయతీ సిద్ధేశ్వరస్వామి కొండ గ్రామంలో చంద్రబాబు చేసిన మోసాలను గుర్తుచేస్తూ ఇంటింటికీ వంచన అనే కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వంలో మోసగాళ్లు ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబ్బు ఎక్కువగా ఉన్నవారిని ఎన్నుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టి ప్రజలందరికీ అలివి గాని హామీలిచ్చి మోసం చేశారన్నారు. అదే కోవలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటింగ్ ముందు రోజు నియోజకవర్గంలోని దళితవాడల్లో ఐదువేల రూపాయల కూపన్లు పంచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచేన తరువాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయారని దుయ్యబడ్డారు. పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా కొండలు తవ్వేసి గ్రావెల్ మాఫియా చేసి చైన్నెకి తరలించేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీలలో సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంగాధర నెల్లూరులో జరుగుతున్న ప్రకృతి వనరుల ధ్వంసం పై ఎల్‌ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేశారు.