
తోతా‘పూర్’
కాణిపాకం : ప్రస్తుతం జిల్లాలో మామిడి రైతులు కుదేలవుతున్నారు. ధరాఘాతంతో డీలా పడిపోయారు. తోతాపురి రకంను కొనేవారు లేక విలవిలలాడిపోతున్నారు. టేబుల్ రకాలు సైతం మామిడి రైతులకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈసారి మామిడి ఫలం రైతుకు చేదును మిగిల్చాయి. తద్వారా మామిడిపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.
గత ఐదేళ్లల్లో సిరులు
గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులకు సిరులు కురిపించింది. టేబుల్ రకాలు...జేబులు నింపాయి. ఈరకం కేజీ రూ. 20 నుంచి సెంచరీ(రూ.100) కొట్టాయి. అదే తోతాపురి రూ. 10 నుంచి రూ.75వరకు పలికింది. దీంతో పండిన కాయలను రైతులు కోత కోసి చిత్తూరు, బంగారుపాళ్యం, దామలచెరువు మార్కెట్, ఫ్యాక్టరీలకు విక్రయించుకునేవారు. రోజుల తరబడి క్యూలో వేచి ఉండే పరిస్థితిలు ఉండేవి కావు. కాయలు అన్‌లోడింగ్ అయినా వెంటనే అప్పటికప్పుడే చేతికి డబ్బులు ముట్టేవి. ముఖ్యంగా టేబుల్ రకాలను చాలా మంది రైతులు బెంగుళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు నేరుగా విక్రయించుకునేవారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా కొనుగోలు దారులకు కాయలను పంపేవారు. ఇలాంటి బుకింగ్‌ల ద్వారా రైతులు అధిక లాభాలను గడించేవారు. అలాగే తోతాపురి కాయలు మంచి లాభాలను గడించి పెట్టాయి. ఐదేళ్ల కాలం పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మామిడి రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది.
ప్రత్యామ్నాయం కోసం చెట్లు నరికేస్తూ..
మామిడి ఆశించిన మేర ప్రతిఫలం ఇవ్వకపోవడంతో పాటు అమ్మకపు పోరు పడలేక రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రధానంగా తోతాపురి పంటను నేలమట్టం చేస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో మామిడి చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అలాగే తవణంపల్లి మండలంలోని మామిడి చెట్లను ఇది వరకే నరికివేశారు. యాదమరి మండలం దాసరపల్లి గ్రామంలో ఓ రైతు తోతాపురి చెట్లను తలొగించి టేబుల్ రకం కాయలను అంటుకట్టేందుకు ముందడుగు వేశారు. మరింత మంది రైతులు కూడా మామిడి చెట్లను నరికివేసేందుకు సమాయత్తమయ్యారు. కొబ్బరి చెట్లు పెట్టాలనే యోచనలో ఉన్నారు.
మామిడి.. కష్టాలు..కన్నీళ్లు
మార్కెట్‌లో అమ్ముడుపోని తోతాపురి కాయలు
రైతులకు చేదును మిగుల్చుతున్న వైనం
ఫలరాజుపై ఆశలు వదలుకుంటున్న రైతులు
మామిడి చెట్ల నరికివేతలు.. ప్రత్యామ్నాయం వైపు చూపులు
నేడు కుదేలు
ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దిగుబడిని చూసి...సంబర పడిపోయినా రైతులను ధరలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో వారి ఆశలు ఆడియాశలయ్యాయి. టేబుల్ రకాలు ప్రతి ఫలం ఇవ్వకపోగా..తోతాపురి చేదును నింపింది. రైతులు తోతాపురికాయల అమ్మకానికి అష్ట కష్టాలు పడుతున్నారు. టోకెన్ పద్ధతితో తికమకపడిపోతున్నారు. ఫ్యాక్టరీలు కాయలు తీసుకొచ్చాక మద్ధతు ధర మాయమైంది. ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి రూ.8 పాట పాడి...తర్వాత రూ.6, రూ.5. రూ.4 అంటూ..చివరకు నోరెత్తకుండా చేసింది. ర్యాంపుల్లో రూ.2కే అమ్ముడుబోతుంది. అది కూడా క్యూ పద్ధతిలో కాయలు అమ్ముకుంటున్నారు. ఐదురోజులు అయినా అన్‌లోడింగ్ కానీ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ధరలపై ఫ్యాక్టరీలు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర అమలు విషయంలో నోరెత్తకపోవడంతో రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈసారి మామిడి ధర వివరాలు
మామిడి రకం ధరలు (రూ.లల్లో)
తోతాపురి 2–8
బేనీషా 9–15
కాదర్ 15–30
పులేరా 4–15
కాలేపాడు 15–25
నీలం 10–15
మార్కెటింగ్ శాఖ అధికారుల వివరాల మేరకు గత ఐదేళ్లుగా మామిడి ధరల వివరాలు.(రూ.కేజీలల్లో)
సంవత్సరం బేనీషా పులేరా తోతాపురి కాలేపాడు నీలం కాదర్
2019–20 35 9–12 17–20 24 21 20–40
2020–21 45 17–25 22–25 35 33 22–35
2021 –22 16 –35 12–20 12–55 35–40 12 57–60
2022–23 35–40 12–15 24–75 30–35 25 27–30
కష్టాలు.. నష్టాలే మిగిలాయి..
మామిడి తోటను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడాం. కొన్నేళ్లుగా మంచి ఫలితం ఉండేది. లాభాలొచ్చాయి. తోతాపురి కేజీ రూ.75వరకు అమ్ముకున్నాం. ఈసారి కష్టాలు..నష్టాలు అనుభవించాం. చాలు ఈ పంట అని వదిలించుకుంటున్నాం. అందుకే ఎకరాలో మామిడి తోటలో పంటను తొలగించాం. ప్రత్యామ్నాయంగా పంట వేయాలని అనుకుంటున్నాం.
– కుమార్, తుమ్మింద, చిత్తూరు మండలం
పెట్టుబడి రాలేదు..
ఏటా పెట్టుబడి వేలల్లో పెట్టి అలసిపోతున్నాం. ఈసారి పెట్టుబడి చూస్తే రూ.60 వేలు దాటింది. దిగుబడి బాగనే వచ్చిన..పెట్టుబడికి తగట్టు ఆదాయం ఉండాలి. అప్పుడే రైతు కోలుకుంటాడు. ఆ రకంగా రైతుకు ఫలితం లేదు. తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నష్టాలను గుర్తించాలి. రైతును ఆదుకోవాలి. లేకుంటే ప్రత్యామ్నాయం తప్ప వేరేమార్గం లేదు. – కొత్తూరు బాబు
నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు మండలం

తోతా‘పూర్’

తోతా‘పూర్’