
హామీలకు లేదు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
● హామీలు అమలు చేయని మొనగాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం
● రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ
కార్వేటినగరం: అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయిన మొనగాళ్లు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ఽ అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం కొల్లాగుంట చెక్‌పోస్టు సమీపంలోని వెట్రివేల్ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల కన్వీనర్ శేఖర్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లనిచ్చిన సొంత మామ ఎస్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం లెక్కలేదన్నారు. అబద్ధాలు, మోశాలు, వెన్నుపోటు వంటివి బాబుకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు అడవులు, గుట్టలను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా బాబు దృష్టిలో సంపద సృష్టించడం అని చురకలు అంటించారు. నెల రోజులకు పైగా మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక, పండించిన పంటను తరలించ లేక తల్లడిల్లి పోతుంటే ఏమీ ఎరుగనట్లు బాబు మొహం చాటేయడం దారుణమన్నారు. పేదల ఓట్ల కోసం పంపిణీ చేసిన కూపన్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ రూ.5 వేలు చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. దండుకున్నది చాలక ఎమ్మెల్యేలు మామిడి గుజ్జు పరిశ్రమలనే కాకుండా రైతులు తరలించే మామిడిలోనూ కమీషన్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు
సీఎం కుర్చీ కోసం కూటమిగా ఏర్పడి సూపర్‌సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను వెన్ను పోటు పొడిచాడని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. అధికార దాహంతో 143 హామీలు గుప్పించి ఏడాది పాలనలో కేవలం రెండు పథకాలను అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
ఈ క్రమంలో భాగంగా నూతనంగా నియామకాలు చేపట్టిన వెంకటేష్, మోహనకుమారి, ఆకులగోపి, గాంధీ, మురళీకృష్ణారెడ్డి, మురగయ్య, శ్రీనివాసులురెడ్డి, అన్నివర్గాల అధ్యక్షులను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల పార్టీ కన్వీనర్ శేఖర్‌రాజు చేతుల మీదుగా శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడి గురవారెడ్డి, నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధికారెడ్డి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు ప్రకాష్, రాధిక, సుగుణమ్మ, నియోజకవర్గ యువజ విభాగం అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కార్తిక్‌రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్‌రెడ్డి, మురగయ్య, లోకనాథరెడ్డి, ధనంజయవర్మ, మునికృష్ణ, నందగోపాల్, లడ్డు పాల్గొన్నారు.