
పసివాడి ప్రాణాన్ని కాపడిన ఓ ఎమ్మెల్యే
మరో పాప ప్రాణాన్ని కాపాడలేని మరో ఎమ్మెల్యే
రెండు ఘటనలు పలమనేరు నియోజక వర్గంలోనే..
ఈ రెండింటిపై సోషల్ మీడియాలో రచ్చ..రచ్చ
పలమనేరు: చావు బతుకుల్లో ఉన్న పసిప్రాణాలను కాపాడుకోవాలని ఏ తల్లిదండ్రులకై నా ఉంటుంది. దీనికోసం వారు పడని కష్టాలుండవు. ఇందుకోసం మానవత్వమున్న వారెవరైనా సాయం చేస్తుంటారు. కానీ ఓ ప్రజాప్రతినిధి ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడగా మరో ప్రజాప్రతినిధి ఓ పాప ప్రాణం పోయేందుకు కారణమైన వేర్వేరు ఘటనలు ఇటీవల పలమనేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలపై బాధితుల ఆవేదన సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
పసివాడి ప్రాణం ఇలా నిలబెట్టారు
పలమనేరు పట్టణానికి చెందిన గజ్జల దీపునాయుడు, జగదీష్ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే కాలేయ సమస్య ఉంది. బాబుకు ఆపరేషన్‌కు రూ.20లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. బిడ్డకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత వారికి లేదు. పలు స్వచ్ఛంద సంస్థలు, వారికి తెలిసిన వారి ద్వారా పసివాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరుకే చెందిన ఓ టీడీపీ కార్యకర్త వీరి గోడు విని సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందుంతుందని ధైర్యం చెప్పారు. వెంటనే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసేందుకు వారి కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. అక్కడున్న పీఏతో వారు గోడు వెల్లబోసుకున్నారు.
కానీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆ కార్యకర్త మదనపల్లిలోని తన సోదరి ద్వారా ఇంతియాజ్ అనే వ్యక్తి సాయంతో అక్కడి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిశారు. పిల్లాడి పరిస్థితి విన్న ఆయన వెంటనే స్పందించి లెటర్ ఇచ్చి మంత్రి లోకేష్ ద్వారా సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.15 లక్షలను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ పసివాడు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆ ఆస్పత్రి నుంచి పసివాడి కోసం పోరాడిన టీడీపీ మహిళా కార్యకర్త సోషల్‌మీడియా ద్వారా విడుడల చేసిన వీడియో వైరల్‌గా మారింది. మన ఎమ్మెల్యే చేయలేని పని పక్క జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే చేశారే అని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు.
మరో పాప విషయంలో ఏమి జరిగిందంటే...
బైరెడ్డిపల్లి మండలం, తీర్థం పంచాయతీ, కై గల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు జనసేన కార్యకర్త. ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి లివర్ దెబ్బతింది. బాలికను పరిశీలించిన డాక్టర్లు లివర్ మార్పిడి చేయాలని ఇందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పారు. నియోజకవర్గ జనసేన నాయకుని ద్వారా స్థానిక ఎమ్మెల్యే లెటర్ కోసం పలుద ఫాలు ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కుప్పానికి చెందిన వారి బంధువైన మండల స్థాయి నేత ద్వారా ఇక్కడి ఎమ్మెల్యే సిఫారస్తు లెటర్ కోసం ప్రయత్నించారు.
ఓ రోజు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని తెలిసి శ్రీనివాసులే స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడి లెటర్‌పై సంతకం చేస్తుండగానే లోకల్ లీడర్లు ఏమి చెప్పారోగానీ సంతకం పెట్టలేదు. ఇదేంటంటే మీ మండలంలోని నాయకులు కాకుండా కుప్పం వాళ్లు రెకమెండేషన్ ఏంటని అభ్యతరం చెప్పినట్టు తెలిసింది. ఏమీ చేయలేక ఆ జనసేన కార్యకర్త వచ్చేశాడు. గతనెల 24న ఆ పాప మృతి చెందింది. దీనిపై కడుపు మండి ఆ తండ్రి తనకు జరిగిన అన్యాయాన్ని తన బిడ్డను కాపాడుకోలేకపోయాననే బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. ఇలా ఈ రెండు ఘటనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.