
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
– తాళం వేసిన ఇళ్లే టార్గెట్
నగరి : తాళం వేసి ఉన్న ఇల్లు, ఆఫీసుల్లో చొరబడి చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ ధరన్‌సాయి (35)ను నగరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమ కథనం మేరకు గత నెల 8వ తేదీన కొండచుట్టు మండపం ఏరియాలో లాయర్ లోకేష్ ఆఫీసులో అర్ధరాత్రి, గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి లక్ష రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ విషయమై లోకేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. అందిన సమాచారం మేరకు ఓంశక్తి గుడి వద్ద నిఘా పెట్టిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధరన్‌సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడన్నారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన నగదులో రూ. 75 వేల రూపాయలు, రూ. 40 వేల రూపాయల విలువ చేసే రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడిపై గతంలో తిరుత్తణిలో చోరీ కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ విజయ నాయక్, సిబ్బంది లోకనాథం, గోపి, సత్య, గజేంద్ర, అశోక్, రమేష్‌ను అభినందించారు.